నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్యం పాలసీ స్కామ్‌లో అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం ఏప్రిల్ 15వ తేదీ వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు. తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్.. రోజువారి దిన చర్య ఎలా ఉంటుందో తెలుసుకుందాం. తీహార్ జైలులోని జైల్ నెంబర్ 2లో కేజ్రీవాల్ ఉండనున్నారు. జైల్ నెంబర్ వన్‌లో మనీశ్ సిసోడియా ఉన్నారు. మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జెయిన్.. జైల్ నెంబర్ 7లో ఉన్నాడు. రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ జైల్ నెంబర్ 5లో ఉన్నారు. సాధారణంగా జైలులో ఖైదీల దినచర్య సూర్యోదయంతో మొదలవుతుంది. అంటే ఉదయం 6.30 నిమిషాలకు ఆ రోజు ప్రారంభం అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్ రూపంలో ఖైదీలకు ఛాయ్‌తో పాటు బ్రెడ్ ముక్కలు ఇస్తారు. ఉదయం స్నానం చేశాక.. ఒకవేళ కోర్టు ఉంటే కేజ్రీ ఆ కేసు వాదనలకు వెళ్తారు లేదా లీగల్ టీమ్‌ను కలుస్తారు. ఇక లంచ్ ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య ఉంటుంది. దాంట్లో పప్పు, కూరగాయలు, అయిదు రోటీలు లేదా అన్నం ఉంటుంది. ఇక మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఖైదీలను తమతమ సెల్స్‌లోనే లాక్ చేస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఓ కప్పు టీ, రెండు బిస్కెట్లు ఇస్తారు. లాయర్లను సాయంత్రం 4 గంటలకు కలుసుకోవచ్చు. డిన్నర్ కూడా ముందే ఉంటుంది. సాయంత్రం 5.30 నిమిషాలకు డిన్నర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఖైదీలను ఏడు గంటలకే లాకప్‌లోకి పంపిస్తారు. కేజ్రీవాల్‌కు టీవీ చూసే అవకాశం కల్పించారు. మీల్స్, లాకప్ సమయంలో టీవీ ఉండదు. 20 ఛానళ్ల వరకు అందుబాటులో ఉంటాయి. దాంట్లో న్యూస్, ఎంటర్‌టైన్మెంట్, స్పోర్ట్స్ ఛానళ్లు ఉంటాయి. కేజ్రీవాల్ డయాబెటిక్ పేషెంట్. జైలులో ఉన్నన్ని రోజులు అతనికి రెగ్యులర్‌గా హెల్త్ చెకప్‌లు చేస్తారు. అయితే ఆయన ఆరోగ్యం దృష్ట్యా.. ప్రత్యేక డైట్ అందించాలని కేజ్రీ లాయర్లు కోరారు. జైలు నుంచే ఆదేశాలు ఇస్తున్న సీఎం కేజ్రీని .. వారానికి రెండుసార్లు కలుసుకునేందుకు ఫ్యామిలీ సభ్యులకు అవకాశం ఇచ్చారు. ప్రిజన్ సెక్యూర్టీ ఆ సభ్యులను క్లియర్ చేయాల్సి ఉంటుంది.