స్పోర్ట్స్‌ స్కూల్‌లో లైంగిక వేధింపులు

– ఓఎస్‌డి హరికృష్ణ సస్పెండ్‌
– ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌
– తక్షణం స్పందించిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌
– క్రీడారంగంలో కలకలం
నవతెలంగాణ-హైదరాబాద్‌ ,సిటీ బ్యూరో
అభం శుభం తెలియని బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రత్యేక అధికారి (పశువుల డాక్టర్‌) హరికృష్ణ గర్ల్స్‌ హాస్టల్‌ గెస్ట్‌ హౌస్‌లో తిష్ట వేసి అమ్మాయిలను వేధిస్తున్నట్టు ఓ పత్రిక కథనం వెలువరించటంతో..తెలంగాణ క్రీడా వర్గాల్లో తీవ్ర దుమారం రేగుతుంది.
హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రత్యేక అధికారి హరికృష్ణ అక్కడి బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కొంతకాలంగా బాలికల వసతి గృహంలోని గెస్ట్‌ హౌస్‌ కేంద్రంగా రాత్రిళ్లు బాలికలను లైంగికంగా వేధిస్తున్నట్టు ఓ పత్రిక కథనం ప్రచురించింది. స్పెషల్‌ ఆఫీసర్‌ హరికృష్ణపై లైంగిక ఆరోపణల వార్తలతో క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. స్పెషల్‌ ఆఫీసర్‌ను తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నట్టు క్రీడాశాఖ మంత్రి ప్రకటించారు. ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీ ఏర్పాటు చేస్తూ.. పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
ఏం జరిగింది?
పశుసంవర్థక శాఖకు చెందిన వెటర్నరీ డాక్టర్‌ హరికృష్ణ డిప్యూటేషన్‌పై 2019 నుంచి హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ ఓఎస్‌డిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గత కొంతకాలంగా స్పోర్ట్స్‌ హాస్టల్‌ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఉన్నతాధికారుల దృష్టికి సైతం వచ్చినట్టు సమాచారం. దీనిపై అంతర్గత విచారణ జరిపినా.. మంత్రి అండదండలు హరికృష్ణకు ఉండటంతో చర్యలకు ఉన్నతాధికారులు వెనుకాడినట్టు సదరు కథనం సారాంశం. ఈ విషయాన్ని కొందరు కోచ్‌లు, మహిళా ఉద్యోగినులు లేవనెత్తినట్టు తెలుస్తోంది. బాధిత బాలికలు అక్కడి మహిళా ఉద్యోగులతో తమకు జరిగిన అన్యాయంపై బోరుమన్నట్టు సమాచారం. రాత్రి సమయాల్లో ఓఎస్‌డి హరికృష్ణ బాలికల వసతి గృహంలోని గెస్ట్‌ హౌస్‌లోనే ఉంటున్నాడని అనేందుకు సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు చాలని అంటున్నారు. ఇది కాకుండా, స్పోర్ట్స్‌ స్కూల్‌లోనే పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగితో సైతం ఓఎస్‌డి రాసలీలలు నడుపుతున్నట్టు సదరు కథనం వెల్లడించింది.
ఓఎస్‌డి సస్పెన్షన్‌
లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. సీఎం కెసిఆర్‌ పాలనలో ఇటువంటి ఆగడాలకు చోటు లేదని, తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను ట్విట్టర్‌ వేదికగా కోరింది. దీంతో ఆదివారం ఉదయమే ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ ఓఎస్‌డి హరికృష్ణను సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. పూర్తి స్థాయి విచారణ కోసం ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీ నియమించారు. జింఖానా స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ సుధాకర్‌ను స్పోర్ట్స్‌ స్కూల్‌ ఇన్‌చార్జి ఓఎస్‌డిగా నియమిస్తూ క్రీడాశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. సమీక్ష సమావేశంలో శాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌, కార్యదర్శి శైలజ రామయ్యర్‌, శాట్స్‌ డైరెక్టర్‌ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఎవరీ హరికృష్ణ
పశుసంవర్థక శాఖకు చెందిన వెటర్నరీ డాక్టర్‌ హరికృష్ణ తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం నాయకుడు. 2025 వరకు సొంత శాఖ నుంచి డిప్యూటేషన్‌ తెచ్చుకున్నారు. నగరానికి చెందిన ఓ మంత్రి ఆశీర్వాదంతో క్రీడాశాఖలో కీలక పదవి చేపట్టారు. స్పోర్ట్స్‌ స్కూల్‌ ఓఎస్‌డిగా ఉండేందుకు స్పోర్ట్స్‌లో కనీసం పిహెచ్‌డి అవసరం. క్రీడల్లో ఎటువంటి ప్రావీణ్యం లేని వ్యక్తిని ముఖ్యమైన క్రీడా పాఠశాలకు స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమించారు. దీనిపై ప్రశ్నించిన ఓ మహిళా కోచ్‌ను జిల్లా క్రీడాధికారి పదవి నుంచి తప్పించి.. తిరిగి కోచ్‌గా డిమోషన్‌ చేయటం గమనార్హం. స్పోర్ట్స్‌ స్కూల్‌ బాలికలపై లైంగిక వేధింపులపై స్పందించిన బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎల్‌ ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘ ఓ వెటర్నరీ డాక్టర్‌కు స్పోర్ట్స్‌ స్కూల్‌లో ఏం పని?. ఎవరి ఈయను పశుసంవర్థక శాఖ నుంచి క్రీడాశాఖకు బదిలీ చేశారు? హరికృష్ణను తక్షణమే భర్తరఫ్‌ చేయాలి. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, హరికృష్ణ వ్యవహారాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలి’ అని డిమాండ్‌ చేశారు.
ఇక తనపై వచ్చిన ఆరోపణలను హరికృష్ణ ఖండించారు. ‘నాపై కుట్ర చేస్తున్నారు. లైంగిక వేధింపుల వార్త పూర్తిగా ఆరోపణలే. అందులో ఎటువంటి వాస్తవం లేదు. మూడున్నరేండ్లుగా ఇక్కడ ఓఎస్‌డిగా పని చేస్తున్నాను. ఓ పత్రిక కథనం ఆధారంగా విచారణ లేకుండా సస్పెండ్‌ చేయటం అన్యాయం. నేను బాలిక హాస్టల్‌లోకి వెళ్లినట్టు వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని’ హరికృష్ణ అన్నారు.
‘ఇప్పుడిప్పుడే బాలికలు క్రీడల్లోకి వస్తున్నారు. స్పోర్ట్స్‌ స్కూల్‌ ఘటన వంటి లైంగిక వేధింపుల వార్తలతో అమ్మాయిల తల్లిదండ్రుల దృక్పథం మారే ప్రమాదం ఉంది. ఇటువంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలి’
– పుల్లెల గోపీచంద్‌, బ్యాడ్మింటన్‌ కోచ్‌
‘సీఎం కెసిఆర్‌ పాలనలో ఇటువంటి ఆగడాలకు తావు ఉండకూడదు. బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై తక్షణం చర్యలు చేపట్టాలి. పూర్తి స్థాయి విచారణ జరిపించి బాధితురాళ్లకు న్యాయం చేయాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను కోరుతున్నాను’
– ఎమ్మెల్సీ కవిత
‘మహిళలపై లైంగిక వేధింపుల విషయంలో తెలంగాణలో ఎటువంటి రాజీ లేదు. ఆరోపణలు వచ్చిన అధికారిని తక్షణమే సస్పెండ్‌ చేశాం. సమగ్ర విచారణ కోసం ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశాం. లైంగిక వేధింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేంక్షించబోం. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం’
– మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌
‘ఒక వెటర్నరీ డాక్టర్‌కు స్పోర్ట్స్‌ స్కూల్‌లో ఏం పని? పశు సంవర్థక శాఖ నుంచి క్రీడాశాఖకు ఎందుకు, ఎవరు బదిలీ చేశారు? హరికృష్ణను తక్షణమే భర్తరఫ్‌ చేయాలి. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, హరికృష్ణ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపించాలి’
– ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌
‘స్పోర్ట్స్‌ స్కూల్‌ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఘటన పట్ల కఠినంగా వ్యవహరించాలి. వేధింపులకు పాల్పడిన అధికారిని అరెస్టు చేసి జైలుకు పంపించాలి’
– అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు.

Spread the love