– ముస్లింలకు హర్యానా గ్రామ పంచాయితీల హుకుం
– విమర్శల వెల్లువతో సర్పంచ్‌లకు అధికారుల నోటీసులు
చండీఘర్ : హర్యానాలోని నూహ్ లో గత నెల 31న చెలరేగిన మతపరమైన హింసాకాండ నేపథ్యంలో తమ గ్రామాలలోకి ముస్లింల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఆ రాష్ట్రంలోని కొన్ని గ్రామ పంచాయితీలు తీర్మానాలు ఆమోదించాయి. వీటిపై విమర్శలు చెలరేగడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆయా పంచాయితీలు, సర్పంచులకు షోకాజ్ నోటీసులు పంపింది. హర్యానా గ్రామ పంచాయితీరాజ్ చట్టంలోని సెక్షన్ 51 ప్రకారం ఏడు పంచాయితీలు, వాటి సర్పంచులకు సంబంధిత జిల్లా అధికారులు షోకాజ్ నోటీసులు పంపారని అధికారులు తెలిపారు. ఈ సెక్షన్ ప్రకారం పంచాయితీ పాలకవర్గాన్ని రద్దు చేయవచ్చు. లేదా సర్పంచ్‌ని పదవి నుండి తొలగించవచ్చు. పంచాయితీల నుండి సమాధానం అందిన తర్వాత వాటిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. మత సామరస్యాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నించే వారిని ఉపేక్షించబోమని, తప్పనిసరిగా చర్య తీసుకుంటామని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా రేవరి, జజ్జర్, మహేంద్రఘర్ జిల్లాలలోని పలు గ్రామ పంచాయితీలకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయని ఓ వార్తా పత్రిక తెలిపింది. అయితే వీధి వ్యాపారుల పూర్వాపరాలు తెలుసుకునేందుకే షోకాజ్ నోటీసులు జారీ చేశామని సర్పంచ్‌లు వివరణ ఇచ్చారు. వీధి వ్యాపారులలో ఎక్కువ మంది ముస్లింలే కావడం గమనార్హం.