– నగరం నడిబొడ్డున 6.87 ఎకరాల భూమి కేటాయింపు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలగ, బలిజ, కాపు, ఒంటరి తదితర అనుబంధ కులాల సంక్షేమానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పెద్దపీట వేస్తుందని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు. సౌత్ ఇండియా సెంటర్ ఫర్ కాపు కమ్యూనిటీ భవన్ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు 6.87ఎకరాల భూమిని జీఓ నెంబర్ 87 ద్వారా కేటాయించిన విషయం తెలిసిందే. దీనికోసం చొరవ చూపిన తోట చంద్రశేఖర్‌ను యాళ్ళ వరప్రసాద్ ఆధ్వర్యంలో వివిధ కాపు సంఘాల నాయకులు గజమాలతో సత్కరించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతంలో కాపు అనుబంధ కులాల వారు దశాబ్దాలుగా తీవ్ర అన్యాయానికి గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు కాపులను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ రాజకీయ లబ్ధి పొందుతున్నాయని విమర్శించారు.