సిరీస్‌ సొంతమాయె

Own the series– విజృంభించిన శార్దుల్‌, ముకేశ్‌
–  200 పరుగుల తేడాతో భారత్‌ గెలుపు
కరీబియన్లపై భారత్‌ అప్రతిహాత రికార్డు కొనసాగుతుంది. 2006 నుంచి ఆ జట్టుపై వరుసగా వన్డే సిరీస్‌ విజయాల కార్డు మరింత మెరుగైంది. పేసర్లు శార్దుల్‌ ఠాకూర్‌ (4/37), ముకేశ్‌ కుమార్‌ (3/30) నిప్పులు చెరగటంతో భారీ ఛేదనలో వెస్టిండీస్‌ 151 పరుగులకే కుప్పకూలింది. భారత్‌ 200 పరుగుల తేడాతో గెలుపొందింది. 2-1తో వన్డే సిరీస్‌ టీమ్‌ ఇండియా సొంతమైంది.
నేడు భారత్‌, వెస్టిండీస్‌ తొలి టీ20. హార్దిక్‌ సారథ్యంలోని టీమ్‌ ఇండియా నేడు టరౌబలో కరీబియన్లతో పొట్టి సిరీస్‌ వేటను షురూ చేయనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ఆరంభం

కరీబియన్‌ గడ్డపై కుర్రాళ్లు కేక. రెండో వన్డేలో తడబడినా.. కుర్ర జట్టుతోనే బరిలోకి దిగిన టీమ్‌ ఇండియా 200 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. వన్డే సిరీస్‌ను 2-1తో దక్కించుకుంది. 352 పరుగుల భారీ ఛేదనలో వెస్టిండీస్‌ 151 పరుగులకే కుప్పకూలింది. పేసర్లు శార్దుల్‌ ఠాకూర్‌ (4/37), ముకేశ్‌ కుమార్‌ (3/30) నిప్పులు చెరిగే ప్రదర్శనకు కుల్దీప్‌ యాదవ్‌ (2/25) మాయజాలం తోడైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 351 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (88), ఇషాన్‌ కిషన్‌ (77), సంజు శాంసన్‌ (51), హార్దిక్‌ పాండ్య (70 నాటౌట్‌) అర్థ సెంచరీలు సాధించారు. గిల్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలువగా.. మూడు వన్డేల్లోనూ అర్థ సెంచరీలు బాదిన ఇషాన్‌ కిషన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిచాడు.
పేసర్ల ప్రతాపం
2019 తర్వాత భారత్‌పై వన్డే విజయం రుచి చూసిన కరీబియన్లు.. సిరీస్‌ డిసైడర్‌లోనూ అదే జోరు చూపించాలని తపించారు. కానీ కొత్త బంతితో పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ నిప్పులు చెరిగాడు. ముకేశ్‌ కుమార్‌ దెబ్బకు విండీస్‌ 50/6తో దారుణ పరాజయ కోరల్లో కూరుకుంది!. బ్రాండన్‌ కింగ్‌ (0), కైల్‌ మేయర్స్‌ (4), హోప్‌ (5) ముకేశ్‌ స్వింగ్‌కు దాసోహం అయ్యారు. కార్టీ (6), హెట్‌మయర్‌ (4), షెఫర్డ్‌ (8) సైతం క్రీజులో నిలువలేకపోయారు. మరో పేసర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌పై ప్రతాపం చూపించాడు. అల్జారీ జొసెఫ్‌ (26), మోటీ (39 నాటౌట్‌), యానిక్‌ (19) మెరుపులతో విండీస్‌ 151 పరుగులు చేసింది. 88/8తో వందలోపే కుప్పకూలేలా కని పించినా.. టెయిలెండర్ల మెరుపులతో కరీ బియన్లు 35.3 ఓవర్ల పాటు పోరాడారు. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. శార్దుల్‌ 4, ముకేశ్‌ 3 వికెట్ల చొప్పున ఖాతాలో వేసుకున్నారు.
దంచి కొట్టారు
టాస్‌ నెగ్గిన విండీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. రెండో వన్డేలో తడబడిన కుర్రాళ్లు.. నిర్ణయాత్మక పోరులో దంచి కొట్టారు. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (77), శుభ్‌మన్‌ గిల్‌ (85) తొలి వికెట్‌కు 143 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 43 బంతుల్లోనే కిషన్‌ అర్థ సెంచరీ సాధించగా.. ఎనిమిది ఫోర్ల అండతో 51 బంతుల్లో గిల్‌ అర్థ సెంచరీ కొట్టాడు. ఓపె నర్లు నిర్మించిన గట్టి పునాదిపై మిడిల్‌ ఆర్డర్‌ చెలరేగింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (8) నిరాశ పరి చినా.. సంజు శాంసన్‌ (51), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (70 నాటౌట్‌) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. సూర్యకుమార్‌ (35) తనదైన ఇన్నింగ్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. నలుగురు బ్యాటర్లు అర్థ సెంచరీల మోత మోగించటంతో భారత్‌ 351 పరుగుల భారీ స్కోరు సాధించింది. సీనియర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి చివరి వన్డేకూ దూరంగా ఉన్నారు.
స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌ : కిషన్‌ (స్టంప్డ్‌) హోప్‌ (బి) యానిక్‌ 77, గిల్‌ (సి) యానిక్‌ (బి) మోటీ 85, రుతురాజ్‌ (సి) కింగ్‌ (బి) జొసెఫ్‌ 8, శాంసన్‌ (సి) హెట్‌మయర్‌ (బి) షెఫర్డ్‌ 51, హార్దిక్‌ నాటౌట్‌ 70, సూర్య (సి) యానిక్‌ (బి) షెఫర్డ్‌ 35, జడేజా నాటౌట్‌ 8, ఎక్స్‌ట్రాలు : 17, మొత్తం : (50 ఓవర్లలో 5 వికెట్లకు) 351.
వికెట్ల పతనం : 1-143, 2-154, 3-223, 4-244, 5-309.
బౌలింగ్‌ : జేడెన్‌ 8-0-75-0, మేయర్స్‌ 4-0-25-0, జొసెఫ్‌ 10-77-1, మోటీ 10-1-38-1, షెఫర్డ్‌ 10-0-73-2, యానిక్‌ 8-0-58-1.
వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ : కింగ్‌ (సి) కిషన్‌ (బి) ముకేశ్‌ 0, మేయర్స్‌ (బి) ముకేశ్‌ 4, అతానేజ్‌ (బి) కుల్దీప్‌ 32, హోప్‌ (సి) గిల్‌ (బి) ముకేశ్‌ 5, కార్టీ (సి) గిల్‌ (బి) జైదేవ్‌ 6, హెట్‌మయర్‌ (సి) సూర్య (బి) శార్దుల్‌ 4, షెఫర్డ్‌ (సి) జైదేవ్‌ (బి) శార్దుల్‌ 8, యానిక్‌ (ఎల్బీ) కుల్దీప్‌ 19, జొసెఫ్‌ (సి) కిషన్‌ (బి) శార్దుల్‌ 26, మోటీ నాటౌట్‌ 39, జేడెన్‌ (బి) శార్దుల్‌ 1, ఎక్స్‌ట్రాలు : 7, మొత్తం : (35.3 ఓవర్లలో ఆలౌట్‌) 151.
వికెట్ల పతనం : 1-1, 2-7, 3-17, 4-35, 5-40, 6-50, 7-75, 8-88, 9-143, 10-151.
బౌలింగ్‌ : ముకేశ్‌ 7-1-30-3, హార్దిక్‌ 4-1-13-0, శార్దుల్‌ 6.3-0-37-4, జైదేవ్‌ 5-0-16-1, కుల్దీప్‌ యాదవ్‌ 8-3-25-2, జడేజా 5-1-29-0.

Spread the love