వాడి వేడిగా మండల సర్వసభ్య సమావేశం

– ఆసరా, స్టేట్‌ ఫైనాన్స్‌ నిధులు, ధరణి, విద్యుత్‌ సమస్యలపై అధికారులను నిలదీసిన ప్రజాప్రతినిధులు
– ధరణితోనే భూ సమస్యలకు పరిష్కారం
– షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌
నవతెలంగాణ-కొత్తూరు
ధరణితోనే భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. ఇన్‌చార్జి ఎంపిపి శోభ లింగం నాయక్‌ ఆధ్వర్యంలో మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు తమ మూడు నెలల ప్రగతి నివేదికను చదివి వినిపించారు. పంచాయతీరాజ్‌ ప్రగతి నివేదిక చదువుతున్న సమయంలో కొడిచెర్ల సర్పంచ్‌ వెంకట్‌ రెడ్డి స్టేట్‌ ఫైనాన్స్‌ నిధుల గురించి నిలదీశారు. 20-21 లో ఐదు నెలలు 21-22లో 7 నెలలు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన స్టేట్‌ ఫైనాన్స్‌ నిధులు ఇప్పటివరకూ ఖాతాలో జమ కాలేదని అధికారులపై మండిపడ్డారు. గత ప్రభుత్వంలో స్టేట్‌ ఫైనాన్స్‌ నిధులు నేరుగా గ్రామపంచాయతీలకు వచ్చేవని ప్రస్తుతం ఆల రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌ఎండిఏ అనుమతులు పొంది పరిశ్రమలు స్థాపించుకుంటున్న వ్యాపారుల నుండి రావలసిన పన్నులు నేరుగా గ్రామపంచాయతీలకు రాకుండా వెళుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మా నిధులతో నగరాలను అభివృద్ధి చేసుకుంటే ఎలా అని ఆయన ఘాటుగా విమర్శించారు. సర్పంచ్‌ అంబటి ప్రభాకర్‌ ఎంపీటీసీలు చింతకింది రాజేందర్‌ గౌడ్‌, జగన్మోహన్‌ రెడ్డి, జంగాగళ్ల కృష్ణయ్య విద్యుత్‌ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ మాట్లాడుతూ చిన్న, సన్న కారు రైతులకు లబ్ధి చేకూర్చందుకే ధరణిని తీసుకువచ్చామని అన్నారు. భూ సమస్యలన్నింటినీ పరిష్కరించి పారదర్శకంగా ఉండేలా ధరణిని తీర్చిదిద్దుతామని తెలిపారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రస్తుతం పింఛన్ల సంఖ్య పెరిగిందని అన్నారు. గత ప్రభుత్వ హాయంలో 200 రూపాయలు ఉంటే ప్రస్తుతం 2000 రూపాయలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. స్టేట్‌ ఫైనాన్స్‌ నిధులు గ్రామపంచాయతీలకు ఎందుకు రావడం లేదో చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పిటిసి ఎమ్మె శ్రీ లతా సత్యనారాయణ, ఎంపీడీవో శరత్‌ చంద్రబాబు, తహసీల్దార్‌ రాములు, ఎంపీటీసీలు చింతకింది రాజేందర్‌ గౌడ్‌, డాకియ, దేశాల అంజమ్మ, ఎర్రవల్లి ప్రసన్న, జగన్మోహన్‌ రెడ్డి, జంగగల కృష్ణయ్య, సర్పంచులు సత్తయ్య, చిర్రా సాయిలు, అంబటి ప్రభాకర్‌, మామిడి వసుంధరమ్మ, అరుణ రమేష్‌, మైసగళ్ళ రమాదేవి రమేష్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love