అధికారంలోకి రాగానే అగ్నివీర్‌ రద్దు

After coming to power, Agniveer was abolished– అమరవీరుల విభజన సరికాదు
– గిరిజనంపై బీజేపీ అరాచకాలెన్నో
– పేదమహిళలకు రూ.లక్ష సాయం : రాహుల్‌ గాంధీ
గుమ్లా (జార్ఖండ్‌) : లోక్‌సభ ఎన్నికల తరువాత ఇండియా వేదిక అధికారంలోకి వస్తే అగ్నివీర్‌ పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌గాంధీ మంగళవారం ప్రకటించారు. అగ్నివీర్‌ పథకాన్ని భారత సైన్యం ప్రారంభించలేదని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారని రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఇలాంటి చర్యలతో దేశం కోసం ప్రాణత్యాగం చేసే అమరవీరుల్లో విభజన సరికాదని ఆయన అన్నారు. జార్ఖండ్‌లోని గుమ్లా పట్టణంలో ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. ‘ఇండియా వేదిక అధికారంలోకి రాగానే అగ్నివీర్‌ పథకాన్ని రద్దు చేస్తాం. ఈ పథకాన్ని సైన్యం తీసుకుని రాలేదు, ప్రధానమంత్రి మోడీ తీసుకొని వచ్చారు. అలాగే అమరవీరుల మధ్య విభజనలు మాకు ఇష్టం లేదు. దేశం కోసం ప్రాణత్యాగం చేసినవారందరూ అమరవీరులే. వారికి పెన్షను ఇవ్వాలి’ అని రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. జీఎస్టీపై ఆయన మాట్లాడుతూ ఐదు ట్యాక్స్‌ శ్లాబులతో బీజేపీ ప్రభుత్వం తప్పుడు విధానాలు అమల్జేస్తోందన్నారు. దీనిని సవరించి పేదలపై భారాలు పడనిరీతిలో పన్ను శ్లాబ్‌ విధానం తీసుకొస్తామన్నారు. గిరిజనలకు బీజేపీ అడుగడుగునా ద్రోహం చేస్తోందని రాహుల్‌ విమర్శించారు. ‘వనవాసీ’ పేరుతో ఆదివాసీల అటవీ హక్కులను బీజేపీ ప్రభుత్వం హరిస్తోందని, అడవి బిడ్డల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్యలో రామమందిరం ప్రతిష్టాపనకు, న్యూఢిల్లీలో నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవానికి గిరిజన మహిళ అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకుండా ప్రధాని మోడీ అవమానించారని ఆయన విమర్శించారు. మంగళవారం ముందుగా చైబాసాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, రైల్వేలు మొదలైన వాటిని బడా పారిశ్రామిక వేత్తలకు కాషాయ పార్టీ అప్పగిస్తుందని అన్నారు. అదానీ, అంబానీల కోసమే మోడీ పని చేస్తున్నారని విమర్శించారు. తాము అధికారం లోకి వస్తే కోట్లాది మందిని లక్షాధికారులుగా మారుస్తామని హామీ ఇచ్చారు. పేద మహిళలకు ఏటా రూ. లక్ష సహాయం అందజేస్తామని చెప్పారు.

 

Spread the love