రాజ్యాంగ రక్షణకు కార్మికవర్గం నడుం బిగించాలి

The working class must tighten its belt for the protection of the Constitution– సీఐటీయూ అఖిల భారత కోశాధికారి సాయిబాబు
– ఘనంగా మేడే వారోత్సవాల ముగింపు సభ
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
భారత రాజ్యాంగ రక్షణకు, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ కోసం కార్మికవర్గం నడుం బిగించాలని సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం.సాయిబాబు అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీఓస్‌ గార్డెన్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే వారోత్సవాల ముగింపు సభ నిర్వహించారు. అంతకుముందు సీఐటీయూ కార్యాలయం నుంచి సభ వేదిక వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సభలో సాయిబాబు మాట్లాడుతూ.. కార్మికులు హక్కులు, ఎనిమిది గంటల పని దినం కోసం ప్రాణాలర్పించి చట్టాలు సాధించుకున్నారని గుర్తు చేశారు. 1886 మే 1న అమెరికాలోని చికాగోలో పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కార్మికవర్గం ఎనిమిది గంటల పని దినం కోసం ఉద్యమించిందన్నారు. ఆ క్రమంలో అక్కడి ప్రభుత్వం వారిపై పోలీసులతో కాల్పులు జరిపించడంతో అనేక మంది కార్మికులు అమరుల య్యారని చెప్పారు. వారి త్యాగాల కారణంగా నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది గంటల పని దినాలు అమలవుతున్నాయన్నారు. కార్మికులు చిందించిన రక్తపు మడుగులోనే ఎర్రజెండా పుట్టిందన్నారు. అనంతరం కార్మికుల హక్కుల కోసం సీఐటీయూ అనేక ఉద్యమాలు చేసి సాధించిందని గుర్తు చేశారు. నేడు దేశంలో రాజ్యాంగం, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రమాదంలో ఉన్నాయని, వాటి రక్షణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజ్యాంగం మౌలిక సూత్రాలపై దాడి చేస్తోందని విమర్శించారు. కార్మిక హక్కులను కాలరాస్తూ చట్టాల సవరణ చేసి లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చిందన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నదని, దేశ కార్మిక, కర్షక వర్గం నిర్మించిన ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు చౌకగా అమ్మేస్తుందని వివరించారు. లౌకిక ప్రజాతంత్ర భారత రాజ్యాంగం బీజేపీ పాలనలో ప్రమాదంలో పడిందన్నారు. కార్మిక వర్గం అనేక త్యాగాలు చేసి, పోరాటాల ద్వారా సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని సవరించి, 12 గంటలకు పెంచి శ్రమ దోపిడీకి గురి చేసేలా విధానాలు రూపొందిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు కృషి చేయాలని, పార్లమెంటు ఎన్నికల్లో మతోన్మాద, కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. అభ్యుదయ, వామపక్ష, లౌకిక శక్తులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్‌ కుమార్‌, కోశాధికారి కె.సునీత, ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్‌, లింగాల చిన్నన్న, నైతం శోభ, డి.వెంకటమ్మ, సహాయ కార్యదర్శులు ఎం.సుజాత, జితేందర్‌, పెర్క దేవిదాస్‌, అగ్గిమల్ల స్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి లంక రాఘవులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి పాల్గొన్నారు.

Spread the love