పదేండ్ల పండుగ… ముస్తాబైన నల్లగొండ

– నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవం
– వెలుగులినుతున్న కార్యాలయాలు
– స్వాగతం పలుకుతున్న మామిడి తోరణాలు, ఫ్లెక్సీలు
– జాతీయ జెండాను ఆవిష్కరించనున్న గుత్తా
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్‌
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ పదేండ్ల పండుగకు నల్లగొండ ముస్తాబయింది. ఆవిర్భావ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాలను చేసింది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌తో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ప్రత్యేక రంగు రంగుల విద్యుత్‌ వెలుగులతో వెలుగులినుతున్నాయి. కార్యాలయాల ప్రధాన ద్వారాలు మామిడి, కొబ్బరి, తోరణాలు ఫ్లెక్సీలతో అతిథులను ఆహ్వానిస్తున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తొమ్మిది వసంతాలు పూర్తిచేసుకుని పదవ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ దశాబ్ది ఉత్సవాల సంబరాలను జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లా యంత్రాంగం అమరుల త్యాగాలను స్మరిస్తూ 9 ఏండ్ల తెలంగాణ ప్రస్థానాన్ని కళ్ళకు కట్టేలా కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులు ఇన్ని రోజులుగా చేస్తున్న కసరత్తు పూర్తయింది. 10 ఏండ్ల ప్రత్యేక తెలంగాణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా ఆవిర్భావ దినోత్సవాలను నిరంతరాయంగా 21 రోజులపాటు జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. అసువులు బాసిన అమరుల త్యాగాలు..దశాబ్దాల పోరాటాల చరిత్రను స్మరించుకుంటూ ఉండే కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 9 ఏండ్ల ప్రస్థానాన్ని పదేళ్ల పండుగ సందర్భంగా ఘనంగా చాటేరా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రాష్ట్ర ఏర్పాటు జరిగిన నాటి నుండి సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు, వినూత్న విధానాలు ఇతర రాష్ట్రాలు, దేశానికి ఆదర్శంగా నిలిచిన అంశాలను ఉత్సవాలలో భాగంగా అందరికీ వివరించేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్కార్‌ పథకాలు వాటి విజయాలను ఘనంగా నిర్వహించేలా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కార్యక్రమాల ఏర్పాటుపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. అందుకు అనుగుణంగానే ప్రజలను, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ ప్రగతిని చాటేలా కార్యక్రమాలను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు ఇతర కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాటు చేశారు. నేటి నుండి 21 రోజులపాటు నల్లగొండ జిల్లాలో దశాబ్ది ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా జరగనున్నాయి. నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఇతర అధికారులతో కలిసి ఉదయం 8.40 గంటలకు జిల్లా కేంద్రంలోని గడియారం చేరస్తా వద్ద ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ వారి స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. 9. 10 గంటలకు ప్రసంగం, 9.25 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 10 గంటలకు తేనేటి విందును ఇవ్వనున్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రేపు జిల్లాలో కర్షకులతో సహ భక్తి భోజనాలు.. రైతు దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

Spread the love