రైతు భరోసాకు ఈసీ బ్రేక్‌

రైతు భరోసాకు ఈసీ బ్రేక్‌– మే 13 పోలింగ్‌ తర్వాతే పంపిణీ చేయాలని ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రైతు భరోసా నిధుల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విదించింది. రాష్ట్రంలో లోక్‌సభ పోలింగ్‌ ముగిసిన తర్వాతే నిధులు విడుదల చేయాలంటూ ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. మే 13న పోలింగ్‌ ముగిసిన తర్వాతే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని ఈసీ స్పష్టం చేసింది. ఈ నెల తొమ్మిదో తేదీలోపు అందరికీ రైతుభరోసా చెల్లింపులు చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్‌.వేణు కుమార్‌ అనే వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశారు. సీఎం వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక తెప్పించుకుంది. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలకు సంబంధించిన నగదు బదిలీకి ఎలాంటి ప్రచారం లేకుండా గతంలో అనుమతించినట్టు ఈసీ తెలిపింది. గత శాసనసభ ఎన్నికల సమయంలో కూడా అప్పటి ఆర్థిక మంత్రి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు రైతుబంధు చెల్లింపులకు అనుమతి నిలిపివేసినట్టు పేర్కొంది. ఈసీ నిర్ణయంతో రైతు భరోసా నిధుల చెల్లింపులు ఆగిపోయాయి.

Spread the love