మండుటేసవిలో భారీ వర్షం

Heavy rain in Mandutesavi– చిగురుటాకులా వణికిన భాగ్యనగరం
– ఈదురుగాలులకు తోడుగా భారీ వర్షం
– మియాపూర్‌లో అత్యధికంగా 13.35 సెంటీమీటర్లు నమోదు
– రోడ్లన్నీ అస్తవ్యస్తం.. స్తంభించిన జనజీవనం
– రాష్ట్రంలోనూ పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వాన
– రాత్రి 10 గంటల వరకు 609 ప్రాంతాల్లో వర్షపాతం నమోదు
– రెండు, మూడు డిగ్రీల మేర తగ్గిన ఉష్ణోగ్రతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మండుటేసవిలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన భారీ వర్షం భాగ్యనగరాన్ని చిగురుటాకులా వణికించింది. పలు జిల్లాల్లో ఈదురుగాలుల వానతో పంటలు నేలకొరిగాయి. మంగళవారం రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మొత్తంగా 609 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి పరిధిలోని మియాపూర్‌లో అత్యధికంగా 13.35 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, హైదరాబాద్‌, సంగారెడ్డి, నల్లగొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మెదక్‌ జిల్లాల్లో పలుచోట్ల భారీ వాన పడింది. 25 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. అందులో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ఒకటెండ్రు చోట్ల వడగండ్ల వాన పడింది. బుధ, గురువారం కూడా రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలుల వర్షం పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రాబోయే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే సూచనలున్నాయి. సాయంత్రం, రాత్రి సమయాల్లో ఈదురుగాలులతో కూడిన జల్లులు పడే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా ఉండొచ్చు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే మూడునాలుగు డిగ్రీల మేర పడిపోయాయి. వచ్చే రెండ్రోజులు కూడా రెండు, మూడు డిగ్రీల మేర తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ ఉక్కపోత మాత్రం తీవ్రంగా ఉంది.
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు
నిజామాబాద్‌   44.7 డిగ్రీలు
బిచ్కింద(కామారెడ్డి)   44.7 డిగ్రీలు
నర్సాపూర్‌(నిర్మల్‌)   44.3 డిగ్రీలు
ఠానూర్‌(నిర్మల్‌)   44.1 డిగ్రీలు
మగ్దూంపూర్‌(కామారెడ్డి) 44.0 డిగ్రీలు
అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలివే
మియాపూర్‌ (రంగారెడ్డి)   13.35 సెం.మీ.
కూకట్‌పల్లి (మేడ్చల్‌ మల్కాజిగిరి)    11.78 సెం.మీ.
చందానగర్‌(రంగారెడ్డి)     10.75 సెం.మీ.
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం    10.50 సెం.మీ.
బాచ్‌పల్లి (మేడ్చల్‌ మల్కాజిగిరి)    10.45 సెం.మీ.
ఎమ్‌ఎమ్‌టీఎస్‌ లింగంపల్లి(రంగారెడ్డి)   10.08 సెం.మీ.

Spread the love