ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు వాటా దక్కనీయకుండా బీజేపీ మహాకుట్ర

For SC ST BC Minorities BJP grand conspiracy without getting share– అందులో భాగంగానే 400 సీట్లు అడుగుతుంది
– అవకాశం దొరికితే రిజర్వేషన్లు మార్చేందుకు యత్నం
– కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరం కాదు
– అబద్ధాల ముసుగులో మాజీ సీఎం కేసీఆర్‌ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 90 శాతం వాటా దక్కనీయకుండా బీజేపీ మహాకుట్ర చేస్తున్నదని డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క విమర్శించారు. అందులో భాగంగా రిజర్వేషన్ల రద్దు చేసేందుకు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నదని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ 400 సీట్లు అడగడంలో అంతర్యం ఇదేనన్నారు. ఆ పార్టీ అసలు ఎజెండా కులాల రిజర్వేషన్లు రద్దు చేయడమేనన్నారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్‌ బీజేపీకి వత్తాసు పలకడం సిగ్గు చేటన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలు బండ్ల గణేష్‌, సామ రామ్మోహన్‌రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎప్పటివరకు ఉంటదో కూడా తెలియదంటూ ఆ రెండు పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరం కాదని హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్‌ అబద్ధాల ముసుగులో బతుకున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో 2/3 మెజార్టీ సాధించి, రాజ్యాంగంలోని సెక్యులర్‌ పదాన్ని తొలగింంచాలని కమలనాథులు చూస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసిపోయాయని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పదేండ్ల ప్రభుత్వ పాలనలో రాష్ట్రం చిన్నాభిన్నమైందన్నారు. అలాంటి రాష్ట్రాన్ని మూడు నెలల్లోనే చక్కదిద్దామని తెలిపారు. వాస్తవాలను ప్రజలకు చెప్తున్నందుకే సీఎం రేవంత్‌ను భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. హిట్లర్‌, ముస్సోలినీలాగా కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పదేండ్ల బీజేపీ పాలనలో దేశం అల్లకల్లోలంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యత బడుగు, బలహీన వర్గాలు బీజేపీ అధికారంలోకి రాకుండా చూడాలని కోరారు. దేశంలో ఇలాంటి దుస్థితి రావడం ప్రజాస్వామ్యానికి మంచిదికాదన్నారు. తిరిగి ఆ పార్టీ అధికారంలోకి వస్తే దళిత, గిరిజనులు, బలహీన వర్గాలు తమ హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆ పార్టీకి ఓటేస్తే వేస్తే మన గొంతు మనమే కోసుకున్నట్టు ఉంటుందని, ఆయా వర్గాలకు భవిష్యత్తు లేకుండా పోతుందన్నారు. ఆ పార్టీ నిర్వాకం వల్ల భారతదేశం పెను ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ కుట్ర, కుతంత్రాలను పసిగట్టిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడోయాత్ర, న్యాయయాత్ర చేశారని గుర్తు చేశారు. ఓబీసీ కులగణన చేసి జనాభా దామాషా ప్రకారం ఆస్తులను పంచుతామంటూ రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే కులగణన చేపడుతున్నదని చెప్పారు. రాహుల్‌ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన ప్రక్రియ మొదలైందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ బీజేపీకి మద్దతు ఇవ్వడాన్ని ప్రస్తావించగా… ఆయనకు భావస్వేచ్ఛ ఉందని చెప్పారు.

Spread the love