కోహ్లి కొట్టాడు 186

– భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 571/10
– తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగుల ఆధిక్యం
– డ్రా దిశగా ఆస్ట్రేలియాతో నాల్గో టెస్టు
విరాట్‌ కోహ్లి శతక్కొట్టాడు. మూడేండ్ల సుదీర్ఘ శతక నిరీక్షణకు తెరదించాడు. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై చివరగా టెస్టు శతకం సాధించిన విరాట్‌ కోహ్లి.. 41 ఇన్నింగ్స్‌ల అనంతరం ఐదు రోజుల ఆటలో మరో సెంచరీ బాదాడు. ఆస్ట్రేలియాపై అహ్మదాబాద్‌లో 186 పరుగుల మెగా ఇన్నింగ్స్‌తో చెలరేగిన విరాట్‌ కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగుల భారీ స్కోరు అందించాడు. విరాట్‌ కోహ్లి శతక జోరుకు అక్షర్‌ పటేల్‌ (79) తోడవటంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ విలువైన 91 పరుగుల ఆధిక్యం సొంతం చేసుకుంది. బౌలర్లకు సహకరించని పిచ్‌పై నాలుగు రోజుల్లో రెండు ఇన్నింగ్స్‌లే ముగియటంతో..చివరి టెస్టులో ఫలితం తేలే అవకాశం కనిపించటం లేదు!. భారత్‌, ఆస్ట్రేలియా చివరి టెస్టులో నేడు ఆఖరు రోజు ఆట.

నవతెలంగాణ-అహ్మదాబాద్‌
విరాట్‌ కోహ్లి (186, 364 బంతుల్లో 15 ఫోర్లు) శతకోత్సవం. మొతెరా పిచ్‌పై పరుగుల వరద పారించిన స్టార్‌ బ్యాటర్‌.. కెరీర్‌ 28వ టెస్టు శతకం పూర్తి చేశాడు. విరాట్‌ కోహ్లి సెంచరీకి తోడు అక్షర్‌ పటేల్‌ (79, 113 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్‌ జత కావటంతో నాల్గో రోజు ఆటలో భారత్‌ వేగంగా పరుగులు సాధించింది. తెలుగు తేజం శ్రీకర్‌ భరత్‌ (44, 88 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (28, 84 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అనారోగ్యంతో బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో భారత్‌ పది మంది బ్యాటర్లతో బరిలోకి దిగింది. నాల్గో రోజు చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 3/0తో ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ ఇండియా 91 పరుగుల ఆధిక్యం దక్కించుకోగా.. ప్రస్తుతం ఆస్ట్రేలియా మరో 88 పరుగుల వెనుకంజలో నిలిచింది.
తొలి సెషన్‌ : కొంచెం ఇష్టం..కొంచెం కష్టం!
ఓవర్‌నైట్‌ స్కోరు 289/3తో నాల్గో రోజు ఉదయం సెషన్లో బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్‌ ఇండియాకు తొలి సెషన్‌ సంతృప్తి ఇవ్వలేదు. అదే సమయంలో ఆస్ట్రేలియాకు సైతం ఉదయం సెషన్లో పెద్దగా దక్కిందేమీ లేదు. ఈ సెషన్లో టీమ్‌ ఇండియా 73 పరుగులు రాబట్టగా.. ఆస్ట్రేలియా ఓ వికెట్‌ దక్కించుకుంది. డ్రింక్స్‌ విరామం లోపే రవీంద్ర జడేజా వికెట్‌ కోల్పోయిన టీమ్‌ ఇండియా.. పరుగుల వేటలో దూకుడు తగ్గించింది. విరాట్‌ కోహ్లికి జతకలిసిన తెలుగు తేజం కె.ఎస్‌ భరత్‌ సావధానంగా బ్యాటింగ్‌ చేశాడు. ఆసీస్‌ స్పిన్నర్లు, పేసర్లు గొప్పగా బౌలింగ్‌ చేయలేదు. అయినా, పరుగులు ఆశించిన విధంగా రాలేదు. కంగారూ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ గొప్ప ఫీల్డింగ్‌ మొహరింపులతో బౌండరీల కోసం కోహ్లి, భరత్‌ చెమటోడ్చాల్సి వచ్చింది. చాలా మంచి షాట్‌ కొడితే గానీ బౌండరీ దక్కలేదు. లంచ్‌ విరామ సమయానికి భారత్‌ 362/4తో నిలిచింది.
రెండో సెషన్‌ : శతక దాహం తీరింది
కెరీర్‌లో తొలిసారి ఆట పరంగా విమర్శలు ఎదుర్కొన్న విరాట్‌ కోహ్లి.. టీ20, వన్డేల్లో శతకాలు బాదినా టెస్టుల్లో మాత్రం మూడంకెల స్కోరు అందుకోలేదు. మంచిగా ఆడుతున్నాడు, సెంచరీ కొడతాడనుకున్న ప్రతిసారీ కోహ్లి నిరాశపరిచాడు. అహ్మదాబాద్‌లో మాత్రం కోహ్లి ఆరంభంలో ఇబ్బంది పడ్డాడు. లయాన్‌ అతడిని ఇరకాటంలో పడేశాడు. కానీ ఆడుతున్న కొద్దీ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించిన విరాట్‌.. మొతెరాలో శతక మోత మోగించాడు. ఐదు ఫోర్లతో 241 బంతుల్లో 100 పరుగులు బాదాడు. విరాట్‌ కోహ్లికి ఇది టెస్టుల్లో 28వ సెంచరీ కావటం విశేషం. సుదీర్ఘ కాలం నిరీక్షించిన శతకం సాధించిన వేళ.. డ్రెస్సింగ్‌రూమ్‌ వైపు వచ్చి హెల్మెట్‌ తీసి మెడలో రింగ్‌ను ముద్దాడిన విరాట్‌ కోహ్లి సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఈ శతకంతో విరాట్‌ కోహ్లి మోస్తోన్న భారం దిగిపోయిందంటూ కాంమెటరీ బాక్స్‌లో వ్యాఖ్యాతలు అనటం గమనార్హం. కోహ్లితో పాటు నిలకడగా ఆడిన కె.ఎస్‌ భరత్‌ అర్థ సెంచరీకి ఆరు పరుగుల ముంగిట వికెట్‌ చేజార్చుకున్నాడు. డ్రింక్స్‌ విరామ సమయానికి భారత్‌ 419/5తో నిలిచింది. ఇక్కడ విరాట్‌కు తోడైన అక్షర్‌ పటేల్‌.. ఇన్నింగ్స్‌ను కొత్త పుంతలు తొక్కించాడు. అక్షర్‌ పటేల్‌ దూకుడుగా ఆడటంతో పరుగుల వరద పారించింది. ఈ సెషన్లో ఒక వికెట్‌ కోల్పోయిన భారత్‌ 110 పరుగులు జోడించింది.
మూడో సెషన్‌ : విలువైన ఆధిక్యం సొంతం
బంతితో ఆశించిన ప్రదర్శన చేయకపోయినా.. బ్యాట్‌తో సిరీస్‌లోనే అత్యంత నిలకడగా రాణించిన బ్యాటర్‌గా నిలిచాడు అక్షర్‌ పటేల్‌. బ్యాటింగ్‌కు కష్టమైన పిచ్‌లపై అర్థ సెంచరీ కొట్టిన అక్షర్‌.. సొంతగడ్డ అహ్మదాబాద్‌లోనూ అదే జోరు చూపించాడు. నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 95 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన అక్షర్‌ పటేల్‌ భారత్‌ను డ్రింక్స్‌ విరామానికి ముందే ఆధిక్యంలోకి తీసుకొచ్చాడు. మరోవైపు విరాట్‌ కోహ్లి 12 ఫోర్ల సాయంతో 313 బంతుల్లో 150 పరుగుల మైలురాయి దాటాడు. ధనాధన్‌ వేటలో ఉన్న అక్షర్‌ పటేల్‌ శతకం దిశగా సాగాడు. కానీ అక్షర్‌ పటేల్‌ నిష్క్రమణతో భారత్‌ స్వల్ప ఆధిక్యంతోనే సరిపెట్టుకుంది. విరాట్‌ కోహ్లి ద్వి శతకం కోసం అభిమానులు ఎదురు చూసినా.. అతడే చివరి వికెట్‌గా నిష్క్రమించాడు. దీంతో 186 పరుగుల వద్ద కోహ్లి మ్యాజిక్‌ ముగిసింది. లోయర్‌ ఆర్డర్‌లో అశ్విన్‌ (7), ఉమేశ్‌ (0) నిరాశపరిచారు. మహ్మద్‌ షమి (0) అజేయంగా నిలిచాడు. అనారోగ్యంతో శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌కు రాలేదు. 178.5 ఓవర్లలో 571 పరుగులకు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగుల ఆధిక్యం భారత్‌ దక్కించుకుంది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్‌ లయాన్‌ (3/151), టాడ్‌ మర్ఫీ (3/113) మూడేసి వికెట్లు పడగొట్టారు.
నాల్గో రోజు ఆటలో 6 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా వికెట్‌ నష్టపోకుండా ముగించింది. ఓపెనర్‌ ట్రావిశ్‌ హెడ్‌ (3 బ్యాటింగ్‌, 18 బంతుల్లో)తో కలిసి నైట్‌వాచ్‌మన్‌ మాథ్యూ కునేమాన్‌ (0 బ్యాటింగ్‌, 18 బంతుల్లో) అజేయంగా నిలిచారు. అశ్విన్‌ మూడు ఓవర్లలో వికెట్‌ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. జడేజా, మహ్మద్‌ షమిలు సైతం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 3/0తో కొనసాగుతోంది. ఆసీస్‌ మరో 88 పరుగుల వెనుకంజలో నిలిచింది.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : 480/10
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : రోహిత్‌ శర్మ (సి) లబుషేన్‌ (బి) కునేమాన్‌ 35, శుభ్‌మన్‌ గిల్‌ (ఎల్బీ) లయాన్‌ 128, పుజార (ఎల్బీ) మర్ఫీ 42, విరాట్‌ కోహ్లి (సి) లబుషేన్‌ (బి) మర్ఫీ 186, రవీంద్ర జడేజా (సి) ఖవాజ (బి) మర్ఫీ 28, శ్రీకర్‌ భరత్‌ (సి) హ్యాండ్స్‌కాంబ్‌ (బి) లయాన్‌ 44, అక్షర్‌ పటేల్‌ (బి) స్టార్క్‌ 79, అశ్విన్‌ (సి) కునేమాన్‌ (బి) లయాన్‌ 7, ఉమేశ్‌ యాదవ్‌ రనౌట్‌ 0, మహ్మద్‌ షమి నాటౌట్‌ 0, శ్రేయస్‌ అయ్యర్‌ (అబ్సెంట్‌ హర్ట్‌) 0, ఎక్స్‌ట్రాలు : 22, మొత్తం : (178.5 ఓవర్లలో ఆలౌట్‌) 571.
వికెట్ల పతనం : 1-74, 2-187, 3-245, 4-309, 5-393, 6-555, 7-568, 8-569, 9-571.
బౌలింగ్‌ : మిచెల్‌ స్టార్క్‌ 22-3-97-1, కామెరూన్‌ గ్రీన్‌ 18-1-90-0, నాథన్‌ లయాన్‌ 65-9-151-3, మాథ్యూ కునేమాన్‌ 25-3-94-1, టాడ్‌ మర్ఫీ 45.5-10-113-3, ట్రావిశ్‌ హెడ్‌ 3-0-8-0.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ : మాథ్యూ కునేమాన్‌ బ్యాటింగ్‌ 0, ట్రావిశ్‌ హెడ్‌ బ్యాటింగ్‌ 3, ఎక్స్‌ట్రాలు : 0, మొత్తం : (6 ఓవర్లలో) 3.
బౌలింగ్‌ : రవిచంద్రన్‌ అశ్విన్‌ 3-2-1-0, రవీంద్ర జడేజా 2-1-1-0, మహ్మద్‌ షమి 1-0-1-0.

ఫలితం వచ్చేనా?!
బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ టీమ్‌ ఇండియా సొంతమవటం ఖాయమైంది. అహ్మదాబాద్‌ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో కొండంత స్కోరు ముందున్నా.. అలవోకగా ఆధిక్యం దక్కించుకుంది భారత్‌. మూడేండ్లుగా శతకం కోసం ఎదురుచూసిన విరాట్‌ కోహ్లి (186) సూపర్‌ సెంచరీతో అదరగొట్టాడు. శుభ్‌మన్‌ గిల్‌ (128), అక్షర్‌ పటేల్‌ (79)లు సైతం మెరవటంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 571 పరుగులు చేసింది. చివరి టెస్టులో ఆస్ట్రేలియాకు పెద్దగా అవసరం లేదు. నెగ్గినా.. ఆ జట్టుకు సిరీస్‌ దక్కదు. కానీ భారత్‌కు అత్యవసరం. ఈ టెస్టులో విజయం సాధిస్తే ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో నేరుగా చోటు దక్కించుకోవచ్చు. లేదంటే శ్రీలంక, న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే, అహ్మదాబాద్‌ టెస్టులో నాలుగు రోజుల ఆట ముగిసింది. 12 సెషన్ల ఆటలో రెండు ఇన్నింగ్స్‌లు మాత్రమే ముగిశాయి. ఇంకా రెండు ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంది. మరో మూడు సెషన్ల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఈ మూడు సెషన్లలో ఆస్ట్రేలియా పది వికెట్లు పడగొట్టడంతో పాటు ఆ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్‌ ఛేదించాలి. పిచ్‌ స్వభావం, స్పందిస్తున్న తీరు చూస్తే అది సాధ్యపడే పరిస్థితి లేదు. దీంతో భారత్‌, ఆస్ట్రేలియా నాల్గో టెస్టులో డ్రా తప్పదనిపిస్తుంది. చివరి రోజు పిచ్‌ పగుళ్లు తేలి స్పిన్‌కు అనుకూలిస్తే మినహా.. నేడు ఆటలో ఫలితం ఆశించే అవకాశం ఏమాత్రం లేదు.

 

Spread the love