గ్రామీణ ప్రతిభకు పట్టం

– ముగిసిన మండల స్థాయి సిఎం కప్‌ పోటీలు
– జిల్లా స్థాయి పోటీలకు 85000 మంది అథ్లెట్ల ఎంపిక
– శాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ ప్రకటన
నవతెలంగాణ-హైదరాబాద్‌ : ‘ప్రతిభావంతులైన గ్రామీణ క్రీడాకారులను గుర్తించటం, గ్రామీణ క్రీడల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారులను వెలికితీయటంలో మండల స్థాయి సిఎం కప్‌ పోటీలు విజయవంతం అయ్యాయి. మూడు రోజుల పాటు జాతర వాతావరణంలో సాగిన మండల స్థాయి సిఎం కప్‌ పోటీల్లో గ్రామీణ ప్రతిభకు పట్టం కట్టారు. సిఎం కప్‌ 2023 తొలి అంచె పోటీలను విజయవంతంగా నిర్వహించిన మండల స్థాయి నిర్వహణ కమిటీలకు కృతజ్ఞతలు’ అని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాట్స్‌) చైర్మెన్‌ డాక్టర్‌ ఈడిగ ఆంజనేయ గౌడ్‌ పేర్కొన్నారు. మే 16, 17, 18న మూడు రోజుల పాటు సిఎం కప్‌ మండల స్థాయి పోటీలు బుధవారంతో ముగిశాయి. మండల స్థాయి పోటీల ముగింపు సందర్భంగా నిర్వహణ కమిటీలకు శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయ గౌడ్‌ ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. 618 మండలాల్లో మూడు రోజుల పాటు సాగిన క్రీడా పోటీల్లో 85000 మంది క్రీడాకారులను జిల్లా స్థాయి సిఎం కప్‌ పోటీలకు ఎంపిక చేశారు. మండల స్థాయి పోటీల్లో సుమారు 2 లక్షల మంది క్రీడాకారులు పోటీపడ్డారు. మహిళలు, పురుషుల విభాగంలో అథ్లెటిక్స్‌, ఖోఖో, వాలీబాల్‌, కబడ్డీ, ఫుట్‌బాల్‌ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. మే 22-24న మూడు రోజుల పాటు జిల్లా కేంద్రాల్లో జరుగనున్న జిల్లా స్థాయి సిఎం కప్‌ పోటీలను సైతం ఇదే తరహాలో దిగ్విజయం చేసేలా జిల్లా స్థాయి నిర్వహణ కమిటీలతో శాట్స్‌ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని ఆంజనేయ గౌడ్‌ ఆదేశించారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి సిఎం కప్‌ పోటీలకు ఎంపికైన 85000 మంది క్రీడాకారులకు ఈ సందర్భంగా శాట్స్‌ చైర్మెన్‌ అభినందనలు తెలిపారు.

Spread the love