ప్రణీత్‌కు రూ.2.5 కోట్లు, నందినికి రూ.50 లక్షలు చెస్‌ క్రీడాకారులకు సిఎం కెసిఆర్‌

భారీ నగదు ప్రోత్సాహకం
నవతెలంగాణ-హైదరాబాద్‌
పిన్న వయసులోనే చదరంగంలో రాణించి, తెలంగాణ రాష్ట్రం గర్వపడే విజయాలు సాధించిన ఉప్పల ప్రణీత్‌ (16), వీర్లపల్లి నందిని (19)లకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు భారీ నగదు ప్రోత్సాహకం ప్రకటించారు. చెస్‌లో గ్రాండ్‌మాస్టర్‌ హోదా సాధించిన ఐదో తెలంగాణ క్రీడాకారుడిగా నిలిచిన ఉప్పల ప్రణీత్‌ను సోమవారం డా.బిఆర్‌ అంబెడ్కర్‌ సచివాలయంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు. ‘ ప్రణీత్‌ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలి. ఉన్నత విజయాలు సాధించి భారత దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి. ప్రణీత్‌కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. ప్రణీత్‌ రానున్న కాలంలో సూపర్‌ గ్రాండ్‌మాస్టర్‌గా ఎదిగేందుకు అవసరమైన శిక్షణ, ఇతర ఖర్చుల నిమిత్తం రూ. 2.5 కోట్లను అందిస్తున్నామని’ సిఎం కెసిఆర్‌ తెలిపారు. ప్రణీత్‌ తల్లిదండ్రులను ఈ సందర్భంగా కెసిఆర్‌ అభినందించారు.
        ఇక అంతర్జాతీయ స్థాయిలో చెస్‌ క్రీడలో రాణిస్తున్న దళిత క్రీడాకారిణి వీర్లపలి నందినికి సైతం సిఎం కెసిఆర్‌ నగదు బహుమతి అందించారు. ప్రపంచ చెస్‌ సమాఖ్య నుంచి ఉమెన్‌ క్యాండిడేట్‌ మాస్టర్‌గా గుర్తింపు పొందిన వీర్లపల్లి నందిని భవిష్యత్‌లో ఉన్నత విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రణీత్‌, నందినిలకు నగదు బహుమతి అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చూడాల్సిందిగా కార్యదర్శి భూపాల్‌రెడ్డిని సిఎం కెసిఆర్‌ ఆదేశించారు.

Spread the love