ధాన్యం కొనుగోలు పర్యవేక్షణకు విజిలెన్స్‌ బృందాలు

తరుగు తీస్తే క్రిమినల్‌ కేసులు
– మిల్లర్‌ అక్నాలెడ్జ్‌ ఇవ్వకుండా జాప్యం చేస్తే జిల్లా మేనేజర్లపై చర్యలు
– రైతులకు అన్యాయం జరిగేలా మిల్లర్లకు సహకరిస్తే ఉపేక్షించేది లేదు
– పౌరసరఫరాల సంస్థ చైర్మెన్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌
– నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం చేసిన ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు వచ్చిన తర్వాత తాలు పేరుతో తరుగు తీయడం చట్ట విరుద్దమని తేమ, తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు పెడితే ఉపేక్షించేది లేదని పౌరసరఫరాల సంస్థ చైర్మెన్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ రైస్‌ మిల్లర్లను హెచ్చరించారు. రైతులను ఇబ్బందులకు గురిచేసి తరుగు పేరుతో కోత విధించే మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
క్షేత్రస్థాయిలో కొంత మంది అధికారుల నిర్లక్ష్యం వల్ల తరుగు సమస్య వస్తుందన్న ఫిర్యాదులపై ఆయన ఇప్పటికే జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకున్నారు. దీనిపై మాట్లాడుతూ అధికారుల అలసత్వం వల్ల రైతులు ఇబ్బందులకు గురైతే కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడబోమని హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రొక్యూర్మెంట్‌, మార్కెటింగ్‌, ఫైనాన్స్‌ అధికారులతో బుధవారం సమీక్షించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల సంస్థ విజిలెన్స్‌ ఆండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులతో 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లాల్లో ఎంత ధాన్యం కొనుగోలు చేశారు? ఓపీఎంఎస్‌ ఎంత నమోదు చేశారు? రెండింటికీ మధ్య ఉన్న వ్యత్యాసాలు, ఓపిఎంఎస్‌ నమోదులో ఎదురవుతున్న సమస్యలు, ఆలస్యానికి గల కారణాలు, కొనుగోలు చేసిన ధాన్యంలో ఎంత ధాన్యం మిల్లులకు తరలించారు? ఏ ఏ మిల్లుల్లో మిల్లర్‌ అక్నాలెడ్జ్‌ సమస్య ఉంది?, సమస్య ఉన్న మిల్లులను విధిగా సందర్శించడం, చెల్లింపుల ఆలస్యానికి కారణాలపై విశ్లేషణ, చెల్లింపులను వేగవంతం చేయడానికి చేపడుతున్న చర్య లను ఈ బృందాలు ప్రధానంగా సమీక్షిస్తాయని తెలిపారు.
ధాన్యం కొనుగోలు వివరాలను మిల్లర్లు ట్రాక్‌ షీట్లో నమోదు చేయడంలో జాప్యం జరుగుతున్నదని రవీందర్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలనీ, అలాగే రైస్‌ మిల్లర్లు కూడా ధాన్యాన్ని వెంటనే దించుకుని వివరాలను ట్రాక్‌ షీట్లో నమోదు చేయాలని ఆదేశించారు.
ఈ విషయంలో ఎక్కడ జాప్యం జరిగినా దాని ప్రభావం మద్దతు ధర చెల్లింపులపై పడుతుందన్న విషయాన్ని గుర్తించి అధి కారులు పని చేయలని కోరారు. దించుకున్న ధాన్యానికి మిల్లర్‌ అక్నాలెడ్జ్‌ ఇవ్వకుండా జాప్యం చేస్తే దీనికి జిల్లా మేనేజరే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం ప్రతి కొనుగోలు కేంద్రంలో రైసు మిల్లర్‌ ప్రతినిధి ఖచ్చితంగా ఉండాలని ఆదేశించారు. తక్షణం రైసు మిల్లర్‌ ప్రతినిధి ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

Spread the love