– వేల కోట్ల విలువైన ప్లాట్లపై కేసీఆర్ కుటుంబం కన్ను
– బాధిత జర్నలిస్టులకు న్యాయం చేస్తాం.. మిగతా వారికీ ఇండ్లు కట్టిస్తాం: బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జర్నలిస్టులు సొసైటీగా ఏర్పడి కొనుక్కున్న 70 ఎకరాల స్థలాన్ని వారికి ఇవ్వడానికి కేసీఆర్ ప్రభుత్వానికి అభ్యంతరమేంటి? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయల విలువైన ఆ స్థలంపై కేసీఆర్ కుటుంబం కన్నుపడిందనీ, దాన్ని కొట్టేయడానికే ఈ డ్రామా అని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే సొసైటీకి ఆ స్థలం దక్కేలా చూస్తామనీ, సీనియర్, జూనియర్ జర్నలిస్టులు అనే తేడా లేకుండా ఇండ్లు లేని వారందరికీ కట్టిస్తామని హామీ నిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్‌లో గల జేఎన్‌జేహెచ్ సొసైటీ స్థలాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభమైన జర్నలిస్టులకే రాష్ట్రంలో న్యాయం దక్కకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ స్థలం కోసం ఎదురుచూసి 60 మంది జర్నలిస్టులు నేలరాలిపోయారన్నారు. ఇంకెంత మంది చస్తే కనికరిస్తారంటూ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. సుప్రీం కోర్టు తీర్పు ఉల్లంఘనపై పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. చాలీచాలని జీతాలతో జర్నలిస్టులు అద్దె కొంపల్లో ఉంటూ సమాజం కోసం పనిచేస్తున్నారని చెప్పారు. సొసైటీ కమిటీ పేరు చెప్పుకుని కొందరు జర్నలిస్టులు బాగుపడ్డరనీ, ఎమ్మెల్యే, కార్పొరేషన్ పదవులు దక్కించుకున్నారని విమర్శిం చారు. పర్యటనలో సుప్రీంకోర్టు న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎన్.రామచంద్ర రావు, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మేడ్చల్ అర్బన్, రూరల్ జిల్లాల అధ్యక్షులు హరీష్ రెడ్డి, విక్రమ్ రెడ్డి ఉన్నారు.