మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డనేటోళ్లు బీజేపోళ్లు

– దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి హరీశ్‌రావు
– సంక్షేమంలో సీఎం కేసీఆర్‌ పాలన స్వర్ణయుగమంటూ కితాబు
నవతెలంగాణ-సిద్దిపేట
నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ వారు అనుమతులు ఇచ్చిన మెడికల్‌ కళాశాలలను కూడా తామే మంజూరు చేయించామని బీజేపీ నాయకులు చెప్పడం ‘మందికి పుట్టిన బిడ్డను మాకే పుట్టిన బిడ్డని ముద్దాడే’ విధంగా ఉన్నదని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సీఎం కేసీఆర్‌ పాలన సంక్షేమంలో రాష్ట్రం స్వర్ణ యుగం అని అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బార్సు హైస్కూల్‌ గ్రౌండ్‌లో శుక్రవారం నిర్వహించిన సంక్షేమ దినోత్సవంలో భాగంగా నిరుపేద బీసీ కుల వృత్తుల వారికి వివిధ సంక్షేమ పథకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌.. ప్రభుత్వ, ప్రయివేటు మెడికల్‌ కళాశాలలను పరిశీలించి అనుమతులు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మెడికల్‌ కళాశాల నిర్మించిందని, కానీ బండి సంజరు మాత్రం కళాశాలలను తామే తీసుకొచ్చామని చెప్పడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం 157 మెడికల్‌ కళాశాలలను మంజూరు చేస్తే, ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదని తెలిపారు. కేంద్రం అనుమతితో వచ్చిన ఎయిమ్స్‌ కళాశాలలో ఆపరేషన్‌ థియేటర్‌ లేదని, వసతులు లేక అక్కడి విద్యార్థులు, రోగులు ఇబ్బంది పడుతున్నారన్నారు. తెలంగాణ మీద ప్రేమ ఉంటే వరంగల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ తీసుకురావాలని, బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని, వెనకబడిన జిల్లాలకు ఇవ్వవలసిన రూ.1350 కోట్ల పెండింగ్‌ నిధులను ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. దేశంలో 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నా.. వారికి పింఛన్‌ ఇస్తున్న రాష్ట్రం మాత్రం తెలంగాణేనని తెలిపారు. నేడు రూ.2016తో 44 లక్షల మందికి పింఛన్‌ ఇస్తున్నామన్నారు. పక్క రాష్ట్రాలైన మహారాష్ట్రలో రూ.600, కర్నాటకలో రూ.500లకు మించి ఇవ్వడం లేదన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ ద్వారా రాష్ట్రంలో రూ.11,130 కోట్లు ఖర్చు చేసి 12.71లక్షల మంది ఆడపిల్లల పెండ్లిండ్లకు ఆర్థిక సాయం చేశామన్నారు. పింఛన్ల కోసం కేసీఆర్‌ ప్రభుత్వం రూ.59 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. గరీబోళ్ల పెండ్లి హాల్స్‌ అద్దె ఖర్చు తగ్గించేందుకు ప్రతి కులానికి ఒక కమ్యూనిటీ హాల్‌ను నిర్మిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులను బాగు చేయడం మూలంగా ప్రయివేటు ఆస్పత్రులు మూలకుపడే పరిస్థితులు సిద్దిపేటలో నెలకొన్నాయని, ఒకప్పుడు 70 శాతం ప్రసవాలు ప్రయివేటు ఆస్పత్రిల్లో, 30 శాతం ప్రభుత్వ ఆస్పత్రిల్తో జరగగా ఇప్పుడు మొత్తం ఉల్టాగా జరుగుతున్నాయని తెలిపారు. ఈనెల 14వ నుంచి గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్‌ కిట్టు అందజేయనున్నట్టు చెప్పారు. సగౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు శ్మశానవాటికలు నిర్మించామ న్నారు. ఇలా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి సందర్భంలో ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్‌ ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. పిల్లల చదువుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1002 వివిధ గురుకులాలను స్థాపించి నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ఒక విద్యార్థిపై లక్ష రూపాయల వ్యయం చేస్తున్నామనీ, రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మంది విద్యార్థులు గురుకుల విద్యాసంస్థలలో విద్యనభ్యసిస్తున్నారన్నారు. 102 డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. చెత్తను మూడు రకాలుగా వేరుగా సేకరించిన మూలంగా సిద్దిపేట పట్టణంలో ఈగలు, దోమలు, పందులు లేకుండా చేశామని, స్వచ్ఛ సిద్దిపేటకు సహకరించిన అక్కా, చెల్లెలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురికి సంక్షేమ పథకాల ద్వారా మంత్రి ఆర్థిక సాయాన్ని అందించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ రోజా రాధాకృష్ణ శర్మ, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మంజుల రాజనర్సు, రాష్ట్ర మెడికల్‌ బోర్డు మెంబర్‌ పాల సాయిరాం, మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ కనకరాజు, మాజీ మున్సిపల్‌ చైర్మెన్‌ రాజనర్సు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love