బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులపై మూడో రోజూ కొనసాగిన ఐటీ దాడులు

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో మూడో రోజు కూడా ముగ్గురు బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల ఆస్థులపై ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. శుక్రవారం ఉదయం నుంచే దాదాపు 70 మంది ఐటీ అధికారులు ఈ సోదాలలో పాల్గొన్నారు. ముఖ్యంగా, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయాలపై ఈ సోదాలు కొనసాగాయి. అంతేగాక, వీరికి చెందిన రెండు హోటళ్లతో పాటు కొత్తగా బయటకు వచ్చిన వీరి వ్యాపార భాగస్వాముల ఇండ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే, మరో మూడు బృందాలు వీరి నివాసాల్లో మూడో రోజు కూడా సోదాలను కొనసాగించాయి. ఈ సందర్భంగా ఆదాయపు పన్ను శాఖకు చెందిన అకౌంట్స్‌ అధికారులను ఎదురుగా ఉంచుకొని వారి చేత సదరు ప్రజాప్రతినిధులకు చెందిన ఖాతా పుస్తకాల పరిశీలనను జరిపించినట్టు తెలిసింది. వీరి సోదాలు కొనసాగుతుండగానే ప్రజా ప్రతినిధుల నివాసాల ఎదుట వారి అనుచరులు పెద్ద సంఖ్యలో గుమిగూడి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Spread the love