– ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులకు సంబంధించి ఫీజుల నియంత్రణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిప్లమా కోర్సులను ఏఎఫ్‌ఆర్‌సీ పరిధిలోకి తేవాలని గతేడాది ఫిబ్రవరిలో సాంకేతిక విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. దీనిపై ప్రభుత్వం నేటి వరకు నిర్ణయం తీసుకోలేదని, అడ్మిషన్లు జరుగుతున్నందున దానిపై తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రారంభమైనందున ఫీజులు రూ.40 వేలు వసూలుకు ఉత్తర్వులు ఇవ్వాలంటూ పలు ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీలు పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై జస్టిస్ ఎం.సుధీర్‌కుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ కేసులో వివరణ ఇవ్వాలన్న గత ఆదేశాలపై ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి స్పందించకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని గతంలో ఆదేశించారు. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని, ఫీజుల అంశంపై సత్వరమే నిర్ణయం తీసుకుంటామని దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి పరిశీలించారు. ఈ అంశంపై వారం రోజుల్లోగా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అధికారులు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయడంపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాలేజీలు విద్యార్థుల నుంచి రూ.40 వేలు ఫీజు వసూలుకు అనుమతిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. అధికారులు నిర్ణయించే ఫీజులు అంత కంటే తక్కువగా ఉంటే ఎక్కువ వసూలు చేసిన మొత్తాన్ని విద్యార్థులకు తిరిగి చెల్లించాలని కాలేజీలను ఆదేశించారు.
కల్తీ కల్లు మృతుల కేసులో నోటీసులు
పాలమూరు జిల్లాలో కల్తీ కల్లు సేవించి ముగ్గురు మృతి, పలువురు ఆస్పత్రిపాలు కావడానికి బాధ్యులపై తీసుకున్న చర్యలను తెలియజేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. అనిల్‌కుమార్ దాఖలు చేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది. ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, మహబూబ్‌నగర్ జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్, సహాయ కమిషనర్, ఎస్సైలకు నోటీసులిచ్చింది. విచారణను ఆగస్టు 28కి వాయిదా వేసింది.