జిల్లాల్లో గ్రామీణ అథ్లెట్ల షో

నేటి నుంచి జిల్లా స్థాయి సిఎం కప్‌ పోటీలు
33 జిల్లాల్లో పండుగ వాతావరణంలో సిఎం కప్‌ పోటీలు నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేశాం. మండల స్థాయి పోటీల్లో గ్రామీణ క్రీడాకారుల నుంచి అపూర్వ స్పందన లభించింది. క్రీడాశాఖ యంత్రాంగం, క్రీడా సంఘాల ప్రతినిధులు, ఫిజికల్‌ డైరెక్టర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు కలిసి జిల్లా స్థాయి పోటీలను విజయవంతం చేసేందుకు పని చేయాలి
– ఆంజనేయ గౌడ్‌, శాట్స్‌ చైర్మెన్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సిఎం కప్‌ 2023 పోటీలు రెండో అంచెకు చేరుకున్నాయి. 618 మండలాల్లో జరిగిన మండల స్థాయి పోటీల్లో 85000 మంది గ్రామీణ క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నేటి నుంచి జరిగే జిల్లా స్థాయి సిఎం కప్‌ పోటీల్లో 85000 మంది గ్రామీణ క్రీడాకారులు సత్తా చాటేందుకు ఎదురు చూస్తున్నారు. 33 జిల్లాల్లో నేడు కలెక్టర్‌ సారథ్యంలోని నిర్వహణ కమిటీ పోటీలను పర్యవేక్షించనుంది. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా స్థానిక ప్రజా ప్రతినిధులు నేడు ప్రారంభ కార్యక్రమానికి హాజరు కానున్నారు. మండల స్థాయిలో అథ్లెటిక్స్‌, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించగా.. జిల్లా స్థాయి పోటీల్లో వాటికి అదనంగా బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, స్విమ్మింగ్‌, బాక్సింగ్‌, రెజ్లింగ్‌ క్రీడాంశాల్లో పోటీలు జరుగనున్నాయి. ఇక రాష్ట్ర స్థాయి పోటీలకు ఆర్చరీ, షూటింగ్‌, హాకీ, జిమ్నాస్టిక్స్‌, టెన్నిస్‌ క్రీడాంశాల్లో ట్రయల్స్‌ నిర్వహించి జిల్లా జట్లను ఎంపిక చేయనున్నారు. మే 22-24 వరకు జిల్లా స్థాయి సిఎం కప్‌ పోటీలు జరుగుతాయి.
ఉదయం 10 లోపే.. : భారీ ఉష్ణోగ్రతల నేపథ్యంలో పోటీల సమయంలో కీలక మార్పులు చేస్తూ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ జిల్లా నిర్వహణ కమిటీలకు సూచనలు చేశారు. ఉదయం ఏడు గంటలకే పోటీలను ప్రారంభించి, పది గంటల లోపే ముగించేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మధ్యాహ్నాం అథ్లెట్లకు పూర్తి విరామం ఇచ్చి.. సాయంత్రం పోటీలను తిరిగి నిర్వహించేలా షెడ్యూల్‌ రూపొందించాలని ఆదేశించారు. జిల్లా స్థాయి సిఎం కప్‌ పోటీల్లో పోటీపడనున్న 85000 మంది అథ్లెట్లకు వసతి, భోజన, రవాణ ఏర్పాట్లను నిర్వహణ కమిటీలు సిద్దం చేశాయి.

Spread the love