కీవ్ : రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆరంభమై శనివారానికి 500రోజులు గడిచింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ తమ సైనికులను ప్రశంసించారు. ఈ మేరకు నల్ల సముద్ర దీవి అయిన స్నేక్ ఐలాండ్ నుండి ఒక వీడియో విడుదల చేశారు. రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రతిఘటనా సామర్ధ్యానికి ఈ దీవి ఒక ప్రతీకగా నిలిచింది. ఈ దీవిపై తిరిగి పట్టు సాధించడమనేది ఉక్రెయిన్ సైనిక పాటవానికి గొప్ప నిదర్శనంగా నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. తమ భూభాగంలోని ప్రతి అంగుళాన్ని తిరిగి సాధించి తీరుతామని అన్నారు. విజయం సాధించిన ఈ నేల నుండే ఈ 500రోజులుగా పోరు సల్పుతున్న మన సైనికులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని జెలెన్‌స్కీ ఆ సందేశంలో పేర్కొన్నారు. ”ఈ యుద్ధంలో మనం ఖచ్చితంగా విజయం సాధించి తీరుతాం” అని ఆయన వ్యాఖ్యానించారు.
గతేడాది ఫిబ్రవరి 24న మాస్కో దాడులు ఆరంభించిన రోజే స్నేక్ ఐలాండ్ దీవిని రష్యా బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఉక్రెయిన్‌లో అతిపెద్ద ఓడరేవు అయిన ఒడెశాపై దాడి చేయడానికి ఈ దీవి ఒక గ్రౌండ్‌గా ఉపయోగపడుతుందనే ఆలోచనతో దీన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దీవిలోని ఉక్రెయిన్ బలగాలను తొలుత రష్యా బందీగా చేసినా, తర్వాత ఖైదీల మార్పిడి భాగంగా వారిని విడుదల చేశారు. ఈ దీవిని తీసుకున్న తర్వాత ఉక్రెయిన్ సైన్యం భారీగా అక్కడ గల రష్యా దళంపై బాంబుదాడులు వేసింది. దాంతో అక్కడనుండి జూన్ 30న రష్యన్ సైనికులు వెనక్కి మరలాల్సి వచ్చింది.
63 లక్షల మంది శరణార్ధులు : 9వేల పౌరుల మరణాలు
గత 500రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం కారణంగా 63లక్షల మంది శరణార్ధులయ్యారు. వీరిలో ప్రధానంగా మహిళలు, పిల్లలే వున్నారు. 9వేలమంది ఉక్రెయిన్ పౌరులు మరణించారు. ఇంకా ఈ సంఖ్య ఎక్కువే వుండవచ్చని భావిస్తున్నారు. గాయపడిన వారి సంఖ్య 15,779గా వుందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం పేర్కొంది. ఇరు పక్షాల వైపు జరిగిన సైనిక మరణాలను నిర్ధారించడం కష్టసాధ్యంగా మారింది. కీవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లెక్కల ప్రకారం 14,300డాలర్ల మేరకు నష్టం వాటిల్లిందని అంచనా. ఉక్రెయిన్ భూభాగంలో 20శాతం కన్నా తక్కువ భూభాగమే రష్యా అధీనంలో వుందని అంచనా వేస్తున్నారు.