న్యూయార్క్: ఉక్రెయిన్ రష్యాపై చేస్తున్న ప్రతిదాడి విఫలం కావటంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే ఎన్నికల్లో ఓటమిపాలయ్యే అవకాశం ఉన్నట్టు ప్రముఖ జర్నలిస్టు సేమౌర్ హెర్ష్ అభిప్రాయపడ్డారు. డోనెట్స్క్, లుగాన్స్క్, ఖేర్సన్, జపోర్జియా ప్రాంతాలపైన రష్యా పట్టు ఏమాత్రం సడల లేదని ఆయన ఓ పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు.
రష్యాలో 24గంటలపాటు జరిగిన తిరుబాటు ఉక్రెయిన్ ప్రతిదాడి వైఫల్యం నుంచి కాసేపు అందరి దృష్టిని మరల్చినా ఉక్రెయిన్ ఘోర పరాజయం పాలవటం ఖాయమనిపిస్తున్నది. ఉక్రెయిన్‌లో అమెరికా పోషిస్తున్న పాత్రను తన విదేశాంగ విధాన విజయంగా ప్రకటించుకుని 2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలన్న ఆశతోవున్న బైడెన్ రాజకీయ భవితను ఉక్రెయిన్ పరాజయం దెబ్బ తీస్తుందని హెర్ష్ విశ్లేషించాడు. ఇప్పటివరకు అమెరికా ఉక్రెయిన్‌కు 150 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అందించింది. ఉక్రెయిన్ ఓడిపోతే దాని ప్రభావం బైడెన్ భవితపై తీవ్రంగా ఉంటుంది.
ఉక్రెయిన్ ప్రతిదాడి ముందుకు సాగకపోవటానికి గల కారణం అది కేవలం ప్రారంభం మాత్రమేనని, పశ్చిమ దేశాల్లో శిక్షణ పొందిన సైన్యాన్ని ఇంకా రంగంలోకి దింపలేదని ఉక్రెయిన్ రక్షణ మంత్రి అలెక్సే రెజనికోవ్ ప్రకటించాడు. ఉక్రెయిన్ విజయం గురించి మీడియాలో ఎంతగా ప్రచారం చేసినా యుద్ధరంగంలో ఫలితాలు అంతగా ఆశాజనకంగా లేవు. అమెరికా లో బైడెన్‌కున్న జనామోదం రోజురోజుకూ క్షీణిస్తున్న స్థితిలో డెమోక్రాట్లు అప్రమత్తం కావాలని హెర్ష్ హెచ్చరించాడు. ఉక్రెయిన్ సైన్యం ఎంతగా ముందుకు తోసుకొచ్చినా తమ రక్షణ రేఖలను అధిగమించటం అటుంచి కనీసం వాటి సమీపంలోకి కూడా రాలేకపోతున్నాయని రష్యన్ రక్షణ శాఖ ప్రకటించింది. అంతేకాకుండా జర్మనీ సరఫరా చేసిన లియోపర్డ్ 2 భారీ ట్యాంకులు, అమెరికా సరఫరా చేసిన బ్రాడ్లే యుద్ధ శకటాలు రష్యా దాడుల్లో కుప్పయిపోతున్నాయి. ఇదిలావుండగా నాటో దేశాలకు చెందిన అధికారులు కూడా ఉక్రెయిన్ చేస్తున్న ప్రతిదాడి సజావుగా సాగటంలేదని తమ ప్రయివేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. తత్ఫలితంగా ఉక్రెయిన్‌కు చేస్తున్న సహాయంలో కోతపడే అవకాశం ఉంది. రష్యాపై ఉక్రెయిన్ చేస్తున్న ప్రతిదాడిలో చెప్పుకోదగిన విజయాలు ఏమీలేవని నాటో కమాండర్, క్రిష్టోఫర్ కవోలి ఒక ప్రయివేటు సమావేశంలో చెప్పాడు. దీని ప్రభావం ఉక్రెయిన్‌కు అందిస్తున్న ధన సహాయం, మద్దతు, అన్నింటికంటే ముఖ్యంగా రానున్న శాంతి చర్చలపై ఉంటుందని అన్నాడు. ఇటువంటి అవగాహన ఉన్నప్పటికీ పైకి మాత్రం రష్యాను ఓడించే వరకు ఉక్రెయిన్‌కు తమ మద్దతు ఉంటుందని పశ్చిమ దేశాల అధికారులు భీరాలు పలుకుతున్నారు. తాము శాంతి చర్చలకు సిద్ధమని, అందుకు ఉక్రెయిన్ సంసిద్ధంగా లేదని, పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు చేస్తున్న ఆయుధ సరఫరా యుద్ధాన్ని పొడిగిస్తుందే తప్ప తమ దేశాన్ని కదిలించలేదని రష్యా పదేపదే ప్రకటిస్తున్నది.