– ప్రధానిని ప్రశ్నించిన ఈశాన్య విద్యార్థుల సంఘం
– హింస వెనక కేంద్రానికి రహాస్య అజెండా ఉన్నదని ఆరోపణ
– సీఎం రాజీనామా అంటూ వార్తలు : అలాంటిదేమీ లేదని బీరెన్‌సింగ్ ట్వీట్
ఇంఫాల్ : మణిపూర్‌లో కొనసాగుతున్న హింస విషయంలో ప్రధాని మోడీ మౌనం వహించడాన్ని ఈశాన్య విద్యార్థుల సంస్థ (ఎన్‌ఈఎస్‌ఓ) ప్రశ్నించింది. మోడీ తీరును విమర్శించింది. మణిపూర్ హింస వెనకాల కేంద్రానికి ఒక రహస్య అజెండా ఉన్నదని ఆరోపించింది. రాష్ట్రంలో రెండు నెలలుగా అల్లకల్లోల పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ.. ప్రధాని స్పందించకపోవటం పట్ల ఎన్‌ఈఎస్‌ఓ చైర్మెన్ శామ్యూల్ జైర్వా ఆశ్చర్యాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏ విషయం జరిగినా వాటిపై మాట్లాడటానికి క్రియాశీలంగా ఉండే ప్రధాని.. మణిపూర్ విషయంలో మౌనంగా ఉన్నారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలనీ, హింసను ఆపడానికి, సమస్యలను పరిష్కరించడానికి క్రియాశీల చర్యలు తీసుకోవాలని జైర్వా.. ప్రధానిని కోరారు. రాష్ట్రంలోని పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. శాంతి కోసం పిలుపునిచ్చారు.
రాజీ’డ్రామా’
జాతి హింసతో తీవ్ర అల్లర్లు చెలరేగిన మణిపూర్‌లో ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టటం లేదు. గతనెల 3 నుంచి మణిపూర్‌లో కొనసాగుతున్న హింసను కట్టడి చేయటంలో సీఎం బీరెన్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు విఫలమైంది. ముఖ్యమంత్రిగా ఆయన విఫలమైన తీరుపై సర్వత్రా విమర్శలు కొనసాగుతూ వస్తున్నాయి. బీరెన్‌సింగ్ రాజీనామా చేయాలంటూ నిరసనకారుల నుంచి డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన రాజీనామాపై ఊహాగానాలు వెలువడ్డాయి. అల్లర్లకు బాధ్యత వహిస్తూ బీరెన్‌సింగ్ సీఎం పదవికి రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి. రాష్ట్ర గవర్నర్ అనసూయ ఉకిరును కలిసి ఆయన రాజీనామా సమర్పించనున్నారని తీవ్ర చర్చ జరిగింది. గవర్నర్‌ను కలవడానికి బీరెన్‌సింగ్ సిద్ధమయ్యారు. గవర్నర్ నివాసానికి 20 మంది ఎమ్మెల్యేలతో కలిసి మధ్యాహ్నం 2 గంటలకు బీరెన్‌సింగ్ బయలుదేరారు. అయితే, సీఎం రాజీనామా చేయొద్దంటూ బీరెన్‌సింగ్ ఇంటి బయట మహిళలు నిరసన చేశారనీ, దీంతో తాము వెనుదిరగాల్సి వచ్చిందని రాష్ట్ర మంత్రి ఒకరు తెలిపారు.
రాజీనామాను పునరాలోచించుకోవాలని బీరెన్ సింగ్‌ను కోరామనీ, రాజీనామా చేయకుండా బీరెన్‌సింగ్‌ను ఒప్పించి ఆ విషయాన్ని బయటకు వచ్చి ప్రజలకు చెప్పామని మంత్రి సపమ్ రంజన్ సింగ్ తెలిపారు. గవర్నర్‌కు సమర్పించాల్సిన రాజీనామా లేఖను నిరసనకారులకు చదివి వినిపించామనీ, దానిని వారు చించేశారని చెప్పారు. ఇటు బీరెన్ సింగ్ కూడా ప్రస్తుత కీలక తరుణంలో తాను రాజీనామా చేయబోనని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. చిరిగిపోయిన సీఎం రాజీనామా లేఖ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
సీఎం రాజీనామా అంశం ఒక మైండ్‌గేమ్ అని సామాజిక కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు కొట్టిపారేశారు. మణిపూర్‌లో చోటు చేసుకున్న పరిస్థితుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే బీజేపీ ఇలా రాజీనామా అంటూ కొత్త నాటకానికి తెరలేపిందని ఆరోపించారు. రాజకీయంగా ఆ పార్టీ మైండ్‌గేమ్ ఆడుతున్నదని విమర్శించారు. అల్లర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.