Saturday, June 13, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమోడీకి ఎదురుతిరిగితే రాష్ర్టానికి ప్రాజెక్టులు రావా?

మోడీకి ఎదురుతిరిగితే రాష్ర్టానికి ప్రాజెక్టులు రావా?

- Advertisement -

కేంద్రమంత్రులు, రాష్ర్ట ఎంపీలు
ఆ పని ఎందుకు చేయరు?

కిషన్‌‌రెడ్డి బాధ్యతలేని వ్యక్తి
ఆర్వో బీజేపీ కార్యకర్త అవడం వల్లే 
మీనాక్ష‍ి నామినేషన్‌ తిరస్కరణ
శాంతిభద్రతల కోణంలోనే పవన్‌ ‌కళ్యాణ్‌ ‌సభకు అనుమతి ఇవ్వలేదు : సీఎం రేవంత్‌‌

ప్రజాస్వామ్యవాదులు 
‘హిట్లర్‌’ను ఆదర్శంగా తీసుకుంటారా?
నా వ్యాఖ్యలు వక్రీకరించారు ఢిల్లీ మీడియా ఇష్టాగోష్టిలో సీఎం రేవంత్‌‌రెడ్డి


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ వ్యవహారంలో రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) బీజేపీ కార్యకర్తలా వ్యవహరించారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ను బీజేపీ ఆదర్శంగా తీసుకుందనీ, ఆ పార్టీ నేతలు కిమ్ జోంగ్ ఉన్న మాదిరిగా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియాలోనూ ఎన్నికలు జరుగుతాయనీ, ఫలితాలు మాత్రం అధ్యక్షుడు చెప్పిన విధంగా వస్తాయన్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై ఆయన విమర్శలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సభకు హైదరాబాద్‌లో అనుమతి నిరాకరించిన అంశంపైనా సీఎం స్పందించారు. ‘‘మధ్యప్రదేశ్‌లో బీజేపీకి సరిపడా సంఖ్యా బలం లేకపోయినా.. రాజ్యసభ స్థానానికి మూడో అభ్యర్థిని పోటీకి పెట్టారు. ఇప్పటి వరకు బీజేపీ ఓటు చోరీ మాత్రమే చేసింది. ఇప్పుడు సీట్‌ చోరీ కూడా మొదలుపెట్టింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎక్కడైనా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడినట్టు నిరూపించాలి. ఎవరి వద్ద వ్యతిరేకంగా మాట్లాడారో వారే నాకు చెప్పారు.

పోలవరం కోసం 4 మండలాలను ఏపీలో కలిపారు. అదే రీతిలో తెలంగాణ కోసం మహారాష్ట్ర నుంచి 1,500 ఎకరాలు సాధించలేరా? మహారాష్ట్రను ఒప్పించే వరకు కేబినెట్‌ సమావేశానికి రానని కిషన్‌రెడ్డి, రాజీనామా చేస్తామని 8 మంది భాజపా ఎంపీలు చెప్పలేరా? ఆ పార్టీ ఎంపీలు గట్టిగా అడిగితే రాష్ట్రానికి నిధులు వస్తాయి కదా! రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)ను కూడా కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారు. కేటీఆర్‌ చెప్పినట్టు కిషన్‌రెడ్డి డ్రామా ఆడుతున్నారు. తెలంగాణకు వచ్చి వెళ్లేందుకు.. పోటీ చేసేందుకు పవన్‌కళ్యాణ్‌కు పూర్తి స్వేచ్ఛ ఉంది. ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినందునే పవన్‌ విషయంలో తెలంగాణ మంత్రులు స్పందించారు. శాంతిభద్రతల కారణంతోనే ఆయన సభకు అనుమతి ఇవ్వలేదు. ఏపీలో చాలాసార్లు జగన్‌ సభలకు అనుమతి ఇవ్వలేదు. ఎందుకు అనుమతి ఇవ్వలేదో పవన్‌కళ్యాణ్‌ చెప్పాలి. ప్రధాని మోడీనే నన్ను కౌగిలించుకున్నారు.. నేను కాదు. హిట్లర్‌ నాకు ఆదర్శమని నేనెప్పుడూ చెప్పలేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నవారు ఎవరైనా హిట్లర్‌ ఆదర్శమని అంటారా?మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం వద్ద చర్చ జరగలేదు’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -