ప్రపంచం ముందు ప్రత్యామ్నాయ వ్యవస్థగా క్యూబా
ఫైడల్ కాస్ట్రో ఆశయాలే ఆ దేశానికి రక్ష
అమెరికా ఆంక్షలు, కుట్రలను తిప్పికొట్టిన ప్రజలు
విద్య, వైద్యం, అక్షరాస్యతలో ముందంజ : ఫైడల్ కాస్ట్రో శత జయంతి
సెమినార్‌లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి
నవతెలంగాణ-సిటీబ్యూరో
అమెరికన్ సామ్రాజ్యవాదానికి క్యూబా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థగా నిలిచిందని, మార్క్సిజం పట్ల అచంచల విశ్వాసంతో ఫైడల్ కాస్ట్రో ఆ దేశంలో సోషలిజాన్ని నిర్మించారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి అన్నారు. విప్లవ వీరుడు ఫైడల్ కాస్ట్రో శత జయంతి సందర్భంగా హైదరాబాద్ గోల్కొండ క్రాస్‌రోడ్‌లోని సీపీఐ(ఎం) సిటీ కార్యాలయంలో గురువారం ‘అమెరికన్ – సామ్రాజ్యవాదం-సోషలిస్టు క్యూబా ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫైడల్ కాస్ట్రో తన సహచరుడు, సోదరుడైన రౌల్ కాస్ట్రోతో కలిసి సామ్రాజ్యవాద శక్తుల నుంచి క్యూబాను రక్షించారని కొనియాడారు.
విప్లవ పథంలో క్యూబా..
మౌలిక రంగానికి ప్రాధాన్యం
బాటిస్టా నిరంకుశ పాలనలో, తీవ్ర పేదరికంలో ఉన్న క్యూబా ప్రజలను చైతన్యపరిచేందుకు 82 మంది యువకులతో కూడిన బృందంగా ఏర్పడి ఫైడల్ కాస్ట్రో పోరాటం ప్రారంభించారని జ్యోతి చెప్పారు. 1956లో విప్లవ పంథాను పట్టి, 1959 నాటికి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. అధికారం చేపట్టిన వెంటనే ప్రజలందరికీ ఉచిత విద్య, మౌలిక సదుపాయాలు, తాగునీరు, రహదారులను కల్పించే దిశగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు. తన పెరటి దొడ్డిలాంటి క్యూబాలో సోషలిస్టు ప్రభుత్వం ఏర్పాటుకావడాన్ని అమెరికా సహించలేకపోయిందని విమర్శించారు. క్యూబాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించడమే కాకుండా, కాస్ట్రోపై 600 కంటే ఎక్కువ సార్లు హత్యాయత్నాలు చేసిందన్నారు. అనేక సామాజిక రంగాల్లో అమెరికా కంటే క్యూబా ఎంతో అభివృద్ధి సాధించిందని, అందరికీ అందుబాటులో ఉచిత వైద్యం, 99.1 శాతం అక్షరాస్యతతో క్యూబా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. అలీన ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో కాస్ట్రో కీలక పాత్ర పోషించారన్నారు.
1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత క్యూబా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొందని, క్యూబాకు చమురు, ఔషధాలు అందకుండా అమెరికా తీవ్రంగా అడ్డుకుందని తెలిపారు. ఈ క్రమంలో క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ ప్రత్యేక మహాసభ జరుపుకొని, 23 వ్యూహాత్మక రంగాలను ఎంచుకొని అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని చెప్పారు. పర్యాటక రంగంతో పాటు ప్రయివేటు పెట్టుబడులను ఆహ్వానించినప్పటికీ, అవన్నీ ప్రభుత్వ నియంత్రణలోనే ఉండేలా చర్యలు తీసుకున్నారని, పరిపాలనను కింది స్థాయి వ్యవస్థలకు వికేంద్రీకరించారని వివరించారు. ఈ సవాళ్ల సమయంలో చైనా, వియత్నాం దేశాలు క్యూబాకు అండగా నిలిచాయని తెలిపారు. ఒక్క క్యూబానే కాకుండా ప్రపంచ దేశాలన్నింటినీ తన గుప్పెట్లో ఉంచుకోవాలని అమెరికా చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ వంటి దేశాలపై ఆంక్షలు విధిస్తూ, రష్యా నుంచి చమురు కొనొద్దని బెదిరిస్తోందని, టారిఫ్‌లు పెంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన జీ-7 సదస్సు చైనా, రష్యాలను ఏవిధంగా అడ్డుకోవాలనే కుట్రలపైనే చర్చించిందన్నారు. లాటిన్ అమెరికా దేశాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఏర్పడితే సంక్షేమ సహకారాలు నిలిపివేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు.
సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్ మాట్లాడుతూ.. సోషలిస్టు వ్యవస్థను కాపాడుకుంటూనే క్యూబా అమెరికాతో ఢీ అంటే ఢీ అని ఎదురొడ్డి పోరాడుతోందన్నారు. ఈ సెమినార్‌కు పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. నగర కార్యదర్శివర్గ సభ్యులు నాగలక్ష్మి, దశరథ్, మహేందర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



