సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
ఖమ్మంలో ఫైడెల్ కాస్ట్రో శత జయంతి సభ
నవతెలంగాణ-ఖమ్మం కలెక్టరేట్
ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఆర్థిక మాంద్యానికి, సంక్షోభానికి అంతిమ పరిష్కారం సోషలిజంలోనే దొరుకుతుందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని మంచికంటి భవనంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన క్యూబా విప్లవ నాయకులు ఫిడెల్ క్యాస్ట్రో శత జయంతి సభ నిర్వహించారు. ముందుగా క్యాస్ట్రో చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. అమెరికా సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానాల మూలంగానే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొందన్నారు. ఈ పరిస్థితిని అధిగమించడం కోసం అమెరికా వివిధ దేశాలపై దాడులు చేస్తోందని, యుద్ధాలకు పాల్పడుతోందని విమర్శించారు. దీంతో సమస్య మరింత బలపడుతోందని తెలిపారు. సామ్రాజ్యవాదం ప్రోత్సహించిన ప్రపంచీకరణ విధానాల ఫలితంగానే అనేక ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. దీని ఫలితంగా మన లాంటి దేశాలు సైతం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయని తెలిపారు. చదువుకొని సామర్థ్యం కలిగిన యువతకి సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సోషలిస్టు విధానాలతో ముందుకు వెళ్తున్న చైనా వంటి దేశాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని తెలిపారు. ఆర్థిక మాంద్యాన్ని, సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఆ దేశాలు ముందు పీఠిన నిలుస్తున్నాయని, అలాంటి విధానాలను మన దేశ పాలకులు అవలంబించినప్పుడు మాత్రమే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోన్న కేంద్రం
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కారదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, యువత జీవితాలతో చెలగాటమాడుతూ మోడీ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలతో స్వేచ్ఛా, వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నదని, ఆ ఒప్పందాలు దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టే విధంగా ఉన్నాయని విమర్శించారు. ఈ ఒప్పందాల మూలంగా దేశ వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. అందుకే కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనలను, పోరాటాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, బుగ్గవీటి సరళ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, వై.విక్రమ్, మాదినేని రమేష్, మాచర్ల భారతి, మెరుగు సత్యనారాయణ, యర్రా శ్రీనివాసురావు, బండి పద్మ తదితరులు పాల్గొన్నారు.



