ప్రభుత్వ విద్యను కుదేలు చేసిన మోడీ సర్కారు
హయ్యర్ సెకండరీలో చేరకముందే 73 శాతం మంది విద్యార్థులు డ్రాపౌట్
గపాఠశాలలు లేక చదువుకు దూరమవుతున్న లక్షల మంది పిల్లలు
వికలాంగులకు కనీస సౌకర్యాలూ కరువు..కేటాయింపులు ఖర్చు చేయడంలోనూ ఘోర వైఫల్యం
పార్లమెంటరీ కమిటీ నివేదికతో కేంద్ర ప్రభుత్వ విద్యా విధానంపై తీవ్ర ప్రశ్నలు
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశానికి విశ్వగురు అనే నినాదాలు వినిపిస్తున్నా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది పిల్లలకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతోంది. ప్రాథమిక స్థాయిని దాటే కొద్దీ పాఠశాలల సంఖ్య తగ్గిపోవడం, 73 శాతం మంది విద్యార్థులు హయ్యర్ సెకండరీ పూర్తి చేయముందే చదువు మానేయడం, వికలాంగ విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం వంటి అంశాలు కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాల అమలుపై తీవ్రమైన సందేహాలను రేకెత్తిస్తున్నాయని పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ : దేశంలో ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల పరిస్థితిపై పార్లమెంటరీ అంచనా కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విద్యా స్థాయి పెరిగే కొద్దీ పాఠశాలల సంఖ్య, విద్యార్థుల నమోదు గణనీయంగా తగ్గిపోతోంది. ఫలితంగా దాదాపు 73 శాతం మంది విద్యార్థులు హయ్యర్ సెకండరీ పూర్తి చేయకముందే చదువు మానేస్తున్నారని కమిటీ తన పదో నివేదికలో వెల్లడించింది. బడ్జెట్ కేటాయింపులు, నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ) గురించి గ మోడీ సర్కారు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ… క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉందని ఈ నివేదిక పరోక్షంగా తేటతెల్లం చేసింది. 2024-25 యూడైస్+ గణాంకాల ప్రకారం… దేశంలో మొత్తం 10,92,671 ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 9,11,032 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అయితే సెకండరీ స్థాయికి వచ్చేసరికి ఈ సంఖ్య 1,61,808కు, హయ్యర్ సెకండరీ స్థాయిలో కేవలం 90,866కు మాత్రమే పరిమితమవుతోంది. అంటే పిల్లలు పై తరగతులకు వెళ్లే కొద్దీ పాఠశాలలు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఇటు విద్యార్థుల సంఖ్య కూడా ఇదే పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. ప్రాథమిక తరగతుల్లో 6.18 కోట్ల మంది చదువుతుండగా… అప్పర్ ప్రైమరీలో అది 4.08 కోట్లకు పడిపోయింది. సెకండరీలో 2.36 కోట్లకు, హయ్యర్ సెకండరీలో 1.64 కోట్లకు మాత్రమే చేరింది. ఈ గణాంకాల ఆధారంగా దాదాపు 73 శాతం మంది విద్యార్థులు హయ్యర్ సెకండరీ పూర్తి చేయకముందే చదువు నుంచి తప్పుకుంటున్నారని కమిటీ పేర్కొంది.
హక్కుల చట్టం, ఎన్‌ఈపీ అమలు ఎక్కడ?
వికలాంగుల హక్కుల చట్టం–2016 ప్రకారం 18 ఏండ్ల వయస్సు వరకు ఉచిత విద్య హక్కు కల్పించాల్సి ఉండగా, జాతీయ విద్యా విధానం–2020 (ఎన్‌ఈపీ) ‘‘జీరో రిజెక్షన్ పాలసీ’’ని అమలు చేయాలని చెప్తున్నా… ఆ లక్ష్యాలు కాగితాలకే పరిమితమయ్యాయని కమిటీ వ్యాఖ్యానించింది. బడ్జెట్‌ను పూర్తిగా వినియోగించడం, ప్రత్యేక ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయడం, ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకాన్ని వేగవంతం చేయాలని కేంద్ర విద్యాశాఖకు కమిటీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
విద్యపై అనేక నినాదాలు… క్షేత్రస్థాయిలో కఠిన వాస్తవాలు
‘విశ్వగురు’, ‘అమృత కాలం’, ‘నూతన విద్యా విధానం’ వంటి భారీ నినాదాలతో కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నప్పటికీ… ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, గ్రామీణ, అణగారిన విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి తేవడంలో ఆశించిన పురోగతి కనిపించడం లేదని ఈ పార్లమెంటరీ కమిటీ నివేదిక సూచిస్తోంది. పాఠశాలల కొరత, భారీ డ్రాపౌట్‌లు, వికలాంగ విద్యార్థులకు కనీస సౌకర్యాల లేమి, కేటాయించిన నిధులను కూడా సక్రమంగా వినియోగించలేకపోవడం వంటి అంశాలు కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని విద్యావేత్తలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నత పాఠశాలలు పెంచాలి
ఈ పరిస్థితిని మార్చాలంటే ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలలను దశలవారీగా పూర్తి స్థాయి హయ్యర్ సెకండరీ పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలని కమిటీ కేంద్ర విద్యాశాఖకు సూచించింది. ప్రతి ప్రాంతానికీ అందుబాటులో హైస్కూల్
ఉండేలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా(యూటీ)లతో సమన్వయం చేసుకోవాలని కూడా పేర్కొంది.
వికలాంగ విద్యార్థులకు కనీస వసతులూ లేవు
వికలాంగ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల విషయంలో కేంద్ర ప్రభుత్వ పనితీరు మరింత ఆందోళనకరంగా ఉందని కమిటీ పేర్కొంది. దేశవ్యాప్తంగా 14.71 లక్షల పాఠశాలల్లో 5.23 లక్షల పాఠశాలల్లో మాత్రమే ప్రత్యేక మరుగుదొడ్లు ఉండగా, 8.08 లక్షల పాఠశాలల్లో మాత్రమే ర్యాంపులు, హ్యాండ్‌రెయిల్స్ ఉన్నాయి. అంటే సగానికి పైగా పాఠశాలల్లో వికలాంగ విద్యార్థులకు అవసరమైన కనీస వసతులు కూడా లేవని స్పష్టం చేసింది.
నిధులు కేటాయించి ఖర్చు చేయని కేంద్రం
సమగ్ర శిక్ష పథకం కింద 2024-25లో 186 ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.482 లక్షలు కేటాయించినప్పటికీ… అందులో రూ.2.60 లక్షలు మాత్రమే ఖర్చు చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని కమిటీ పేర్కొంది.అలాగే ప్రత్యేక విద్యా బోధకుల నియామకానికి రూ.962 లక్షలు కేటాయించినా.. ఖర్చు చేసినది రూ.80.50 లక్షలు మాత్రమే కావడం అమలు వైఫల్యాన్ని బయటపెట్టిందని వివగించింది.


