Friday, August 14, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపారిపోదాం..!

పారిపోదాం..!

- Advertisement -

దుర్భర జీవనం సముద్రంలోనే తొమ్మిది నెలలుగా జీవనం
నేలను చూసింది రెండు రోజులే
ఒత్తిడిని తట్టుకోలేక పరారయ్యే ప్రయత్నం
యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ నావికుల కన్నీటి కథ

వాషింగ్టన్‌ : యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ నౌకలో నావికులు, సిబ్బంది, వారి కుటుంబాలు నెలల తరబడి గడపాల్సి రావడంతో వారి జీవన పరిస్థితులు ణించాయి. యుద్ధం ఎటూ తేలకపోవడంతో నౌక మోహరింపు కాలాన్ని అధికారులు పదే పదే పొడిగించడంతో వారంతా తీవ్ర మానసిక వేదకను గురయ్యారు. కొందరు ఆత్మహత్యకు ప్రయత్నించారు కూడా.

ఒక్కొక్కదిరీ ఒక్కో వ్యథ
గత గురువారం శాన్‌ డియాగోలో భావోద్వేగ పూరితమైన టౌన్‌హాల్‌ సమావేశం జరిగింది. యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌లో దుర్భరమైన పరిస్థితులను చవిచూస్తున్న నావికుల తరఫున సుమారు 200 మంది కుటుంబ సభ్యులు సీనియర్‌ నౌకాదళ అధికారులను ఈ సమావేశంలో నిలదీశారని తెలుస్తోంది. ‘రేపు నేను నిద్ర లేవకూడదని అనుకుంటున్నాను’ అని తన భర్త సందేశం పంపాడని ఓ మహిళ తాత్కాలిక నౌకాదళ కార్యదర్శి హాంగ్‌ కావోకు చెప్పారు. సైన్యంపై ఒకప్పుడు తమకు ఎంతో నమ్మకం ఉండేదని, ఇప్పుడు నౌకాదళ నాయకత్వం దానిని దెబ్బతీసిందని మరో మహిళ వాపోయారు. మోహరింపును పదే పదే పొడిగించడంతో తన భర్త సముద్రంలో దూకేందుకు ప్రయత్నించాడని అన్నాబెల్‌ లోమా ‘మిలిటరీ టైమ్స్‌’ పత్రికకు తెలిపారు. తన భర్త చాలా అలసిపోయాడని, కెరీర్‌ ఏమవుతుందో అని భయపడుతున్నాడని ఆమె చెప్పారు. ‘అతను భయపడుతున్నాడు. అలసిపోయిన కారణంగా విధుల నుంచి అవమానకరంగా తొలగిస్తారేమోనని ఆందోళన చెందుతున్నాడు. తన 13 సంవత్సరాల కెరీర్‌ నాశనమవుతుందని అనుకుంటున్నాడు’ అని అన్నారు. సముద్రంలో దూకకుండా తోటి నావికుడిని తన భర్త కాపాడారని ఓ మహిళ తెలిపారు. నౌకలో జరుగుతున్న ఆత్మహత్య ప్రయత్నాలు, సుదీర్ఘ మోహరింపు నావికులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

పదే పదే పొడిగింపులు
యుద్ధ విమాన వాహక నౌక యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ గత సంవత్సరం నవంబర్‌ 21న శాన్‌ డియాగో నుంచి బయలుదేరింది. వాస్తవానికి అది పసిఫిక్‌ మహా సముద్రానికి వెళ్లాల్సి ఉంది. కానీ ఇరాన్‌తో యుద్ధం ప్రారంభం కావడంతో దానిని మధ్యప్రాచ్యానికి మళ్లించారు. అప్పటి నుంచి అందులోని నావికులు, సిబ్బంది సముద్ర తీరంలో గడిపిన సమయం చాలా తక్కువ. నౌకలోని ఐదు వేల మంది నావికులు, సిబ్బంది కేవలం రెండు రోజులు మాత్రమే భూమిపై గడిపారు. డిసెంబర్‌లో గ్వామ్‌లో ఒక రోజు, గత నెలలో ఒమన్‌లో మరో రోజు మాత్రమే వారికి నేలపై కాలు పెట్టే అదృష్టం దక్కింది. వాస్తవానికి మే నెలలోనే నౌక మోహరింపు ముగియాల్సి ఉంది. అయితే యుద్ధం కొనసాగుతుండడంతో దానిని ఆ తర్వాత అనేక పర్యాయాలు పొడిగించారు. ఈ విమాన వాహక నౌక ఇప్పుడు ఇరాన్‌పై ఐదో నెల పోరాట కార్యకలాపాలలో నిమగమై ఉంది.

దుర్భర జీవనం… సముద్రంలోనే తొమ్మిది నెలలుగా సహవాసం
ఐదు వేల మంది నావికులు, సిబ్బంది… సముద్రంలో 
తొమ్మిది నెలల మకాం… అందులో నేల అనేదే 
చూడకుండా వరుసగా 250 రోజుల జీవనం…. 
ఈ మాట వింటుంటే ఎవరికైనా గుండె గుభేలుమంటుంది కదా. మధ్యప్రాచ్యంలో అమెరికా మోహరించిన యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ నౌకలోని సిబ్బంది ఈ అసాధారణ సుదీర్ఘ మోహరింపుతో విసిగి వేసారిపోయి పారిపోయేందుకు ప్రయత్నించారు. మిలిటరీ టైమ్స్‌ పత్రిక అందించిన 
నివేదిక ప్రకారం వివరాలిలా…

సేవకు ఇదేనా ప్రతిఫలం?
నౌకాదళం తన ప్రాథమిక బాధ్యతలను సైతం విస్మరిస్తోందని లెవిన్‌ మండిపడ్డారు. ‘ఈ పురుషులు, మహి ళలు మన దేశానికి సేవ చేయడానికి సైన్యంలో చేరారు. వేడి నీరు, పనిచేసే టాయిలెట్‌, కడుపు నిండా భోజనం వంటి సౌకర్యాలు కల్పించడం మన కనీస బాధ్యత. హెగ్‌సేథ్‌ కనీసం వాటిని కూడా అందించలేక పోతున్నారు. కుటుంబసభ్యుల గోడు ఆయనకు అబద్ధాలుగా కన్పిస్తోంది’ అని ధ్వజమెత్తారు.

మౌలిక వసతులకూ కరువే
నౌకలోని సిబ్బంది కేవలం మానసిక ఒత్తిడికే పరిమితమై లేరు. నౌకలో మౌలిక జీవన పరిస్థితులు కూడా దుర్భరంగా ఉన్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కాలిఫోర్నియాకు చెందిన డెమొక్రటిక్‌ సభ్యుడు మైక్‌ లెవిన్‌ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో సిబ్బంది అనుభవిస్తున్న దుర్భర పరిస్థితులను వివరించారు. బూజు పట్టిన షవర్లు, పాడైపోయిన టాయిలెట్లు, వారాల తరబడి పనిచేయని లాండ్రీలు, వేడి నీటి కొరత, అర కప్పు అన్నం…రెండు టోర్టిల్లాలతో ఏ మూలకూ చాలని భోజనం…నౌకలో నెలకొన్న దయనీయ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. సబ్బులు, డియొడరెంట్లు, టూత్‌పోస్టులకూ కొరతగానే ఉంది. రేషన్‌ పద్ధతిలో నాసిరకం భోజనాన్ని అందిస్తున్న ఫొటోలు ఏప్రిల్‌లోనే బయటికి వచ్చాయి. అయితే ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని అప్పుడు రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేథ్‌ కొట్టిపారేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -