అవమానం

– పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతికి అందని ఆహ్వానం
– మోడీ.. రాజ్యాంగ వ్యవస్థల ధ్వంసానికి పరాకాష్ట
– సావర్కర్‌ పుట్టినరోజునే నూతన భవన ప్రారంభం
– భారత స్వాతంత్య్రోద్యమాన్ని అవమానించినట్టే-ప్రతిపక్షాలు
– మోడీకి అనుకూల నిర్ణయం తీసుకున్న లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా
దేశంలో రాజ్యాంగ వ్యవస్థల ధ్వంసం పతాక స్థాయికి చేరింది. ప్రధాని మోడీ ఈ ధ్వంస రచనలో దేన్నీ లెక్కచేయట్లేదు. చివరకు స్వాతంత్య్రోద్యమ చరిత్రను కూడా వక్రీకరిస్తూ, ఆ జాతీయోద్యమంతో ఎలాంటి సంబంధం లేని సావర్కర్‌ పుట్టినరోజు నాడు పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవానికి పూనుకున్నారు. ఈ భవనాన్ని తొలి ఆదివాసీ మహిళా రాష్ట్రపతి ద్రౌపదీముర్ముతో ప్రారంభింపచేయాలని ప్రతిపక్షాలు సూచించినా, కాదు పొమ్మన్నారు. పైగా సావర్కర్‌ పుట్టినరోజు (మే 28) నాడే దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అంత్యక్రియలు జరిగాయి. దాన్ని కూడా మోడీ సర్కారు పట్టించుకోకపోవడం గమనార్హం. మోడీ చర్య రాష్ట్రపతిని జాతీయోద్యమ నేతలను అవమానించినట్టే అని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. మోడీ దుందుడుకు చర్య ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది.
న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్న కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం మనుధర్మ వర్ణాశ్రమ అమలుకు ఏమాత్రం వెనకాడట్లేదు. భారతదేశ హృదయ స్పందన అయిన నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి ఏకంగా రాష్ట్రపతినే అవమానించేలా నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమానికి తొలి ఆదివాసీ మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆహ్వానమే పంపలేదు. నూతన పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతితో ప్రారంభింపచేసేందుకు మోడీ సర్కారు అంగీకరించలేదు. పైగా భారత స్వాతంత్య్రోద్యమంతో ఎలాంటి సంబంధం లేని ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ 140వ జన్మదినమైన మే 28వ తేదీ భారత పార్లమెంట్‌ నూతన భవనాన్ని, ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. కేంద్రం చర్య భారత స్వాతంత్య్ర పోరాట యోధులను అవమానించినట్టేనని తీవ్రంగా విమర్శించాయి. అయితే ప్రధానితో ఈ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించాలనే నిర్ణయాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తీసుకున్నారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే కోరికతోనే ఓంబిర్లా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్షాలు ఆక్షేపిస్తున్నాయి. నూతన పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించాల్సిందిగా రాష్ట్రపతిని కోరివుంటే బాగుండేదని జనతాదళ్‌ ఎంపీ మనోజ్‌ ఝా సహా పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రధాని కాకుండా రాష్ట్రపతే ఈ భవనాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రపతికి ఆహ్వానమే పంపకపోవడాన్ని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే తప్పుపట్టారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుఖేందు శేఖర్‌ రే సైతం ట్విటర్‌ వేదికగా దీనిపై స్పందించారు. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్‌ 26న ఆమోదించారనీ, దానికి గుర్తుగా ఆ తేదీన పార్లమెంట్‌ నూతన భవనాన్ని ప్రారంభిస్తే బాగుండేదని కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేష్‌ అన్నారు. అలాకాకుండా సావర్కర్‌ పుట్టినరోజు నాడు భవనాన్ని ప్రారంభించడమంటే, స్వాతంత్య్ర సమరయోధులందరినీ అవమానించినట్టేనని అభిప్రాయపడ్డారు.
పార్లమెంట్‌ భూమిపూజ మొదలుకుని….
పార్లమెంట్‌ నూతన భవన నిర్మాణానికి 2020 డిసెంబర్‌లో భూమిపూజ చేసింది కూడా ప్రధాని మోడీనే. అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో ఆ పని చేయించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు అప్పుడే వ్యక్తం అయ్యాయి. మోడీ చర్యను సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం వంటి నేతలు తప్పుపట్టారు. ప్రధాని కార్యాలయానికి పార్లమెంట్‌ నిర్వహణ, పనితీరుతో ఎలాంటి సంబంధం ఉండదు. ప్రధాని కేవలం మంత్రిమండలికి నేతృత్వం వహిస్తారు. ఆయనకు పార్లమెంటులో ప్రత్యేకంగా ఎలాంటి హోదా ఉండదు. అలాంటప్పుడు మోడీ ఈ భవనాన్ని ఎలా ప్రారంభిస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. అయితే ఎక్కడ భూమి పూజలు జరిగినా, ఎక్కడ ప్రారంభోత్సవాలు జరిగినా మోడీ హాజరై అన్నీ తానై జరిపిస్తుంటారనీ, బహుశా తన పేరిట అత్యధిక ‘శిలాఫలకాలు’ ఉండాలన్న కోరికతో ఇలా చేస్తూ ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
నెహ్రూ స్మారకకేంద్రాన్ని సందర్శించని మోడీ
1964 మే 28వ తేదీనే భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అంత్యక్రియలు జరిగాయి. మోడీ ప్రధానిగా తొలిసారి 2014 మే 26న ప్రమాణస్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆయన ఒక్కసారి కూడా నెహ్రూ స్మారక కేంద్రమైన శక్తివనాన్ని సందర్శించలేదు. నెహ్రూ కంటే సావర్కర్‌కే మోడీ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వదలచుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయోద్యమంలో భాగస్వాములైన నేతలను కాదని, ఆ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన, చరిత్రను వక్రీకరించిన సావర్కర్‌కే ప్రాధాన్యం ఇవ్వడంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. సావర్కార్‌ స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకోకపోగా, 1937లో నిర్బంధం నుండి విడుదలైన తర్వాత, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశ యువత బ్రిటన్‌ దళాల్లో చేరాలంటూ పిలుపునిచ్చారు. ఆయన ఏనాడూ బ్రిటిష్‌ వారిని వ్యతిరేకులుగా చూసిన దాఖలాలే లేవు. సావర్కర్‌ దృష్టిలో ముస్లింలే హిందువులకు శత్రువులు. మహాత్మాగాంధీ హత్యకు జరిగిన కుట్రలో సావర్కర్‌ కూడా నిందితుడే. విచారణలో కోర్టు ఆధారాలు లేని కారణంగా ఆయన్ని నిర్దోషిగా విడిచిపెట్టినప్పటికీ, గాంధీని హత్య చేసిన గాడ్సే, ఆతని సన్నిహితుడు నారాయణ్‌ ఆప్టేలను ఆయనే ప్రభావితం చేశాడనేది వాస్తవం. ఈ అభిప్రాయంతో ఎవరూ విభేదించడం లేదు. 1966లో సావర్కర్‌ చనిపోయారు. ఇందిర, వాజ్‌పేయిల హయాంలో ఆయనకు సముచిత ప్రాధాన్యతే లభించింది. సావర్కర్‌ పేరిట ఇందిర ప్రభుత్వం తపాలా బిళ్లను విడుదల చేస్తే, వాజ్‌పేయి సర్కారు ఆయనకు ఏకంగా భారతరత్న ఇచ్చేందుకు సిద్ధపడింది. ఆయితే అప్పటి రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌ ఆ ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. అయినప్పటికీ కేంద్రం ఆయన చిత్రపటాన్ని పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో ఆవిష్కరించింది. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ సావర్కర్‌ పుట్టినరోజు నాడు ఆ చిత్రపటానికి పూలమాలలు వేస్తూ నివాళులు అర్పిస్తూనే ఉన్నారు. ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా, ప్రధాని మోడీ మాత్రం ఈ నెల 28న సావర్కర్‌ పుట్టినరోజు నాడే పార్లమెంట్‌ నూతన భవనాన్ని ప్రారంభించేందుకే సిద్ధమవుతున్నారు.

Spread the love