Homeజాతీయంఈసీ బీజేపీకి అనుకూలంగా పని చేస్తోంది

ఈసీ బీజేపీకి అనుకూలంగా పని చేస్తోంది

- Advertisement -
  • సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్)-లిబరేషన్

నవతెలంగాణ-హైదరాబాద్: ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థగా కాకుండా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని వామపక్ష పార్టీలు ఆరోపించాయి. ఎన్నికల కమిషనర్లే కొన్ని నిర్ణయాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, వాటిని పట్టించుకోలేదని వామపక్ష పార్టీలు పేర్కొన్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితి, భారత్‌లో ఎన్నికల ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభంపై చర్చించేందుకు సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్)-లిబరేషన్ పార్టీల సంయుక్త సమావేశం న్యూఢిల్లీలోని ఏకేజీ భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ, సీపీఐ(ఎంఎల్)-లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పాండా, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు, అరుణ్ కుమార్, సీపీఐ(ఎంఎల్)-లిబరేషన్ ఢిల్లీ కార్యదర్శి రవి రాయ్ పాల్గొన్నారు.

ఎన్నికల సంఘం పనితీరుపై ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన దర్యాప్తులో వెల్లడైన అంశాలపై వామపక్ష పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఎన్నికల సంఘం చేపడుతున్న ఏకపక్ష స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స్ (SIR), ఫారం-6లో మార్పులు, గతంలో అమలులో ఉన్న నిబంధనలు, విధానాలు బలహీనపడటంపై ప్రతిపక్ష పార్టీలు గతంలో వ్యక్తం చేసిన ఆందోళనలను ఈ వివరాలు బలపరుస్తున్నాయని పేర్కొన్నాయి.

ఎన్నికల సంఘం సాధారణ సంస్థ కాదు. దాని స్వతంత్రత, నిష్పాక్షికత, పారదర్శకతపైనే భారత ఎన్నికల ప్రజాస్వామ్య విశ్వసనీయత ఆధారపడి ఉంటుంది. కోట్లాది మంది ఓటర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగించడం సహా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై వామపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎన్నికల సంఘం విశ్వసనీయతను పునరుద్ధరించేందుకు జ్ఞానేశ్ కుమార్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.

ఎన్నికల సంఘం స్వతంత్రత, విశ్వసనీయతను కాపాడేందుకు, ఓటు హక్కును పరిరక్షించేందుకు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని వామపక్ష పార్టీలు తమ రాష్ట్ర, జిల్లా, స్థానిక యూనిట్లకు పిలుపునిచ్చాయి. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలను ముగించాలని కోరాయి.

వామపక్ష పార్టీల ప్రధాన డిమాండ్లు:

  • జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.
  • SIR ప్రక్రియను నిలిపివేసి, అన్యాయంగా ఓటర్ల జాబితాల నుంచి తొలగించబడిన వారందరి ఓటు హక్కును పునరుద్ధరించాలి.
  • ఎన్నికల సంఘం స్వతంత్ర, ప్రజాస్వామ్య పనితీరును పునరుద్ధరించాలి.
  • ప్రధాన ఎన్నికల కమిషనర్లు, ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రస్తుతం ఉన్న విధానాన్ని మార్చాలి. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ఎంపిక కమిటీ ద్వారా ఎన్నికల కమిషనర్ల నియామకం జరగాలన్న సుప్రీంకోర్టు ప్రతిపాదన ఆధారంగా కొత్త విధానాన్ని రూపొందించాలి.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -