ట్రంప్‌ దోషే…

– కాలమిస్ట్‌పై లైంగిక వేధింపులు నిజమే
– 5 మిలియన్ల డాలర్లు నష్టపరిహారంగా చెల్లించాలన్న కోర్టు
వాషింగ్టన్‌ : లైంగిక వేధింపుల కేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దోషి అని మన్‌హటన్‌ న్యాయస్థానం నిర్ధారించింది. రచయిత, కాలమిస్ట్‌ ఇ.జేన్‌ కేరోల్‌పై ట్రంప్‌ లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం వాస్తవేమనని జ్యూరీ పేర్కొంది. ట్రంప్‌ ఆమెపై అత్యాచారానికి పాల్పడలేదని, కానీ లైంగిక వేధింపులు చోటు చేసుకున్నాయని కోర్టు తన రూలింగ్‌లో పేర్కొంది. మూడు గంటల పాటు విచారించిన తర్వాత ఈ తీర్పు వెలువడింది. కాలమిస్ట్‌ కేరోల్‌కు నష్టపరిహారంగా 5మిలియన్ల డాలర్లు చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది. కేరోల్‌ నష్టపరిహారం ఎంత కావాలో తన పిటిషన్‌లో పేర్కొనలేదు. న్యాయమూర్తుల నిర్ణయానికే వదిలివేసింది. ఈ వేధింపులు జరిగింది 1996లో అయినా 2019లో కేరోల్‌ తాను రాసిన పుస్తకంలో ఈ విషయాలు బయట పెట్టారు. కాగా, ఈ కేసు విచారణ సందర్భంగా ట్రంప్‌ న్యాయస్థానానికి హాజరు కాలేదు. అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు ట్రంప్‌ ప్రచారం జరుపుతున్న వేళ ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు ట్రంప్‌ను చుట్టుముడుతున్నాయి. కేరోల్‌ ఆరోపణలపై ట్రంప్‌ స్పందిస్తూ కేవలం పుస్తకాల అమ్మకాలు పెంచుకునేందుకే ఆమె ఇలా మాట్లాడుతున్నారని ఆనాడు ఆరోపించారు. తనను వేధింపులకు గురి చేసేందుకు ఇదంతా చేస్తున్నారని తాజాగా తీర్పు అనంతరం ట్రంప్‌ ప్రకటన చేశారు. మొత్తంగా 12మందికి పైగా మహిళలు ట్రంప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.

Spread the love