ఉక్రెయిన్‌ యుద్ధంలో మృత్యుహేళను దాస్తున్న న్యూయార్క్‌ టైమ్స్‌

న్యూయార్క్‌: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో ఉక్రెయిన్‌ చేస్తున్న ”వసంతకాల ప్రతిదాడి” నిర్ణయాత్మక మూలమలుపుగా ఉంటుందని న్యూయార్క్‌ టైమ్స్‌ జనవరి నుంచి అనేక వ్యాసాలను ప్రచురించింది. అయితే ఆరు వారాలుగా కొనసాగుతున్న ఈ ”వసంతకాల ప్రతిదాడి” రష్యా రక్షణ రేఖలను ఏమాత్రం కదిలించలేకపోయింది. ఈ ప్రయత్నంలో అనేక వేలమంది ఉక్రెయిన్‌ సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ సందర్బంగా న్యూయార్క్‌ టైమ్స్‌ ఉక్రెయిన్‌ సైన్యం దుస్థితిని గురించి ఒక వ్యాసాన్ని ప్రచురించింది. ఉక్రెయిన్‌ ”వసంతకాల ప్రతిదాడి”పైన టైమ్స్‌ ప్రచురించిన వ్యాసం శీర్షిక: ”కుచించుకుపోతున్న సైన్యం, నమ్మటానికి వీలులేని ఆయుధాలు: తూర్పులో ఉక్రెయిన్‌ ఎదుర్కొంటున్న అడ్డంకులు”. ఈ శిర్షికకు ”భయానక అనిశ్చితి” అనే ఉపశీర్షికను టైమ్స్‌ జోడించింది.
యుద్ధంలో ఉక్రెయిన్‌ కొనసాగిస్తున్న ”వసంతకాల ప్రతిదాడి” దారుణంగా విఫలమైందనీ, ఈ దాడిలో ఉక్రెయిన్‌ సైన్యం పెద్ద ఎత్తున్న హతులయ్యారని, అలా హతులయిన వారి స్థానంలో వయసు మీరిన వారిని పంపి బలవంతంగా యుద్ధం చేయిస్తున్నారని ఈ వ్యాసంలో న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. ఇదే కాకుండా ఇంకా చాలానే రాసింది. కొన్ని యూనిట్లలో సైనికులందరూ మరణించటమో, గాయపడటమో జరిగింది. ఆ తరువాత అదే యూనిట్‌లో చేరిన కొత్తవాళ్ళు కూడా అంతకుముందువలే మరణించటమో, గాయపడటమో జరిగింది. అలాగే ఉక్రెయిన్‌కు అందించిన మందుగుండు చాలావరకూ పాతది. పాత పేలుడు పదార్థాలు మిస్పైర్‌ కావటమో, యాదృశ్చికంగా పేలి సైనికులను గాయపరచటమో జరుగుతుంటుంది. అలాగే యువకులైన సైనికులు యుద్ధంలో మరణిస్తే వారి స్థానంలో వయసుమీరిన వారిని పంపటమంటే ఉక్రెయిన్‌ సైన్యంలో యువకులు అందుబాటులో లేరని అర్థం చేసుకోవలసి ఉంటుందని ఆ వ్యాసంలో పేర్కొనటం జరిగింది. ఇవే విషయాలను ఒక జర్నలిస్టు గనుక రిపోర్ట్‌ చేసివుంటే ఈ అంశాలలో ప్రతిదీ ఒక ‘స్కూప్‌’ అయి ట్విట్టర్‌కు ఎక్కివుండేదే. కానీ న్యూయార్క్‌ టైమ్స్‌ ఎంచుకున్న మార్గం వేరు. ఇంతటి ప్రాధాన్యతగల విషయాలను ఎక్కడో లోపల ప్రచురించి, ఆ తరువాత ఆన్‌ లైన్‌ నుంచి న్యూయార్క్‌ టైమ్స్‌ తీసివేసింది. అయితే ఈ విషయాలను సమాధి చేస్తే చాలదు. చెరిపి వెయ్యాలనే ఆలోచన టైమ్స్‌ ది. ఈ వ్యాసాన్ని తూర్పు కాలమానం ప్రకారం ఉదయం 5.32గంటలకు ఆర్కైవ్‌.ఆర్గ్‌ కాపీ చేసింది. ఆ తరువాత 24గంటల్లో ఎటువంటి వివరణ ఇవ్వకుండా ఆ వ్యాసంలోని మూడు ముఖ్య విషయాలను పూర్తిగా తుడిచివేయడం జరిగింది. యుద్ధంలో ఉక్రెయిన్‌ ఒక దేశంగాను, ప్రజలుగాను సర్వనాశనం అవుతున్న స్థితిని అమెరికా ప్రజలకు తెలియకుండా చేయటమే లక్ష్యంగా అమెరికా మీడియా పనిచేస్తోంది. కేవలం ఒక నెల క్రితమే న్యూయార్క్‌ టైమ్స్‌ జర్నలిస్టు, బ్రెట్‌ స్టీఫెన్స్‌ ఉక్రెయిన్‌ ”వసంతకాల ప్రతిదాడి”తో రష్యా చిత్తుచిత్తుగా ఓడిపోతుందని రాశాడు. అలాగే వాషిగ్టన్‌ పోస్టు కాలమిస్టు, మ్యాక్స్‌ బూట్‌ ఉక్రెయిన్‌ అప్రతిహతంగా ముందుకు సాగుతుందని రాశాడు. కానీ వాస్తవం వేరేగా ఉంది. దుర్భేద్యమైన రష్యా రక్షణ వలయాలను ఛేదించే ప్రయత్నంలో మొదటి ప్రపంచ యుద్ధం తరహాలో సైనిక దళాలకు దళాలే తుడిచిపెట్టుకు పోయాయి. అలా హతులైన వారి స్థానంలో వచ్చిన కొత్త రిక్రూట్లు కూడా హతం అయ్యారు. అమెరికా మిలిటరీ, ఇండిష్టియల్‌ కాంప్లెక్స్‌ ను నడుపుతున్న యుద్ధోన్మాదులకు, వారి తొత్తులుగా మారిన ఉక్రెయిన్‌ పాలకులకు ప్రజల ప్రాణాలు మందుగుండుతో సమానం. ఈ మానవ హననం అమెరికా ప్రపంచాధిపత్య పతనంతో ముడిబడి ఉంది. మరో మహాయుద్ధానికి దారితీస్తుందేమోననే భయం మానవాళిని కలవరపెడుతోంది.

Spread the love