ఆకాశంతో పోటీ పడుతూ…

– ఆసియా, ఆఫ్రికా దేశాలలో బియ్యం ధరలు పైపైకి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వ నిషేధమే కారణం
న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న ధరలను నియంత్రించే పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడంతో ఆసియా, ఆఫ్రికా దేశాలలో దాని ధరలు ఆకాశంతో పోటీ పడుతూ సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఇప్పటికే వివిధ దేశాలలోని ఆహార మార్కెట్లు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. గోరుచుట్టుపై రోకటిపోటులా ఇప్పుడు భారత్‌ నుండి దిగుమతులు నిలిచిపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ప్రస్తుతానికి ధరలు పెరగడం అనివార్యమని, ఏ మేరకు పెరుగుతాయో చూడాల్సి ఉంటుందని థారు బియ్యం ఎగుమతి దారుల సంఘం గౌరవాధ్యక్షుడు చూకియత్‌ ఆపస్‌వాంగ్సే చెప్పా రు. ధరలు ఒక్కసారిగా పెరు గుతాయని, దశల వారీగా పెరగడం ఉండదని ఆయన తెలిపారు. ఆసియా, ఆఫ్రికా దేశాల ప్రజలకు బియ్యం ప్రధానమైన ఆహారం. దీని ధరలు పెరిగితే ద్రవ్యోల్బణ ఒత్తిడులు మరింత అధికమవుతాయి. కొనుగోలుదారుల దిగుమతి బిల్లులు తడిసిమోపెడవుతాయి. దేశంలో పెరుగుతున్న ధరలకు కళ్లెం వేసేందుకు బాసుమతి మినహా మిగిలిన బియ్యం రకాల ఎగుమతులపై భారత్‌ ఆంక్షలు విధించింది. అయితే ఎల్‌నినో కారణంగా వ్యవసాయ సరఫరాలపై పడుతున్న ప్రభావం, యూరప్‌లో పెరిగిన ఉష్ణోగ్రతలు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వంటి పరిణామాలు ఆయా దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. భారతదేశం విధించిన నిషేధాన్ని ఈ పరిణామాల నేపథ్యంలో చూడాల్సిన అవసరం ఉన్నదని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ ఎమిరిటస్‌ పీటర్‌ టిమ్మర్‌ తెలిపారు. వీటితో పాటు ఆందోళన కలిగించే అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయని, వాటి కారణంగా ఆసియాలో బియ్యం ధరలు చాలా వేగంగా అదుపు తప్పుతాయని ఆయన హెచ్చరించారు.
అభ్యర్థనలు వస్తే…
ప్రస్తుతానికి ఇతర దేశాల నుండి అభ్యర్థనలు వస్తే వాటి ఆహార భద్రతా అవసరాలను దృష్టిలో పెట్టుకొని బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు భారత్‌ అనుమతిస్తోంది. బాసుమతి బియ్యం, ఉడకబెట్టిన బియ్యం ఎగుమతులపై ఎలాంటి ఆంక్షలు లేవు. భారత్‌ నిషేధ ప్రభావం ఆసియా, ఆఫ్రికా దేశాలపై ఏ మేరకు ఉంటుందన్న విషయం ఆంక్షల కాలపరిమితి పైన, ఆయా దేశాలు దౌత్య మార్గాల ద్వారా బియ్యం కొనుగోలుకు చేసుకునే ఏర్పాట్ల పైన ఆధారపడి ఉంటుంది.
ధరలు పెంచనున్న వియత్నాం, థాయ్
వియత్నాం నుంచి కూడా బియ్యం ఎగుమతులు అధికంగానే జరుగుతాయి. ఇప్పటికే ఆ దేశం టన్ను తెల్ల బియ్యాన్ని (5శాతం) 600 డాలర్లకు విక్రయిస్తోంది. థారులాండ్‌ కూడా ధర పెంచే అవకాశం ఉంది. థారు ప్రభుత్వం ప్రస్తుతం టన్ను బియ్యానికి 534 డాలర్లు వసూలు చేస్తోంది. భారత్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో సుమారు 30 నుంచి 40శాతం వరకూ బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. వర్షపాతంలో అసమానతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఇతర ఆహార ధాన్యాల ఎగుమతులపై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌ విధించిన ఆంక్షలు చైనా, మలేసియా, ఫిలిప్పీన్స్‌, ఇండొనేషియా, ఆఫ్రికా దేశాలకు బియ్యం రవాణాపై ప్రభావం చూపుతాయి.

Spread the love