గిరిజనుడిపై మూత్ర విసర్జన

– బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడి దురాగతం
– మధ్యప్రదేశ్‌లో ఘటన
– ఆలస్యంగా వెలుగులోకి..నిందితుడి అరెస్ట్‌
భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే సహాయకుడొకడు కండకావరంతో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తించాడు. తనకు ఇవ్వాల్సిన వేతనం అడిగిన పాపానికి ఓ గిరిజన యువకుడిపై దౌర్జనం చేశాడు. అంతటితో ఆగక మద్యం మత్తులో అతనిపై అమానవీయంగా మూత్ర విసర్జన చేశాడు. ఈ దృశ్యం సామాజిక మాధ్యమాలలో వైరల్‌ కావడంతో పోలీసులు నిందితుడిని మంగళవారం రాత్రి అరెస్ట్‌ చేశారు.
నిందితుడు ప్రవేశ్‌ శుక్లా బీజేపీ ఎమ్మెల్యే కేదార్‌నాథ్‌ శుక్లా సహాయకుడు. సింధి జిల్లాలో కొన్ని నెలల క్రితమే ఈ ఘటన జరిగినప్పటికీ దీనికి సంబంధించిన పది సెకన్ల వీడియోను మంగళవారం సామాజిక మాధ్యమాలలో ప్రదర్శించారు. పోలీసుల కథనం ప్రకారం…36 ఏండ్ల దశ్‌మత్‌ రావత్‌ కుబ్రి గ్రామంలోని మార్కెట్‌కు వెళుతుండగా ప్రవేశ్‌ ఎదురుపడ్డాడు. అప్పటికే అతను మద్యం మత్తులో ఉన్నాడు. రావత్‌ అతని వద్దకు వెళ్లి తనకు రావాల్సిన వేతనం గురించి అడిగాడు. దీంతో మండిపడిన ప్రవేశ్‌ అతనిపై దాడి చేసి, ఆ తర్వాత మూత్ర విసర్జన చేశాడు. బాధితుడైన రావత్‌ కోల్‌ గిరిజన తెగకు చెందిన వాడు. కాగా జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అతని కుటుంబసభ్యులు భయపడ్డారు. అయితే విషయం తెలియగానే తమంత తామే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని బహ్రీ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ పవన్‌ సింగ్‌ చెప్పారు. నిందితుడిపై జాతీయ భద్రతా చట్టాన్ని (ఎన్‌ఎస్‌ఏ) ప్రయోగిం చాలని సిఫార్సు చేసినట్టు తెలిపారు.
కాంగ్రెస్‌ ఆగ్రహం
ఈ ఘటనపై సకాలంలో చర్యలు తీసుకోవడం లో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని కాం గ్రెస్‌ విమర్శించింది. గిరిజనులను బీజేపీ అవమాని స్తోందని మండిపడింది. బీజేపీ మనస్తత్వానికి ఈ ఘటన అద్దం పడుతోందని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు విక్రాంత్‌ భూరియా వ్యాఖ్యానించా రు. రోజూ ఇలాంటి వందలాది సంఘటనలు జరుగు తున్నాయని, అయితే అవి వెలుగులోకి రావడం లేదని చెప్పారు.
ఎమ్మెల్యే బుకాయింపు
ప్రవేశ్‌ శుక్లాతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ఎమ్మెల్యే కేదార్‌నాథ్‌ శుక్లా బుకాయిం చారు. ప్రవేశ్‌ తనకు సహాయకుడు కాదని చెప్పారు. ‘ప్రవేశ్‌ నాకు తెలుసు. కానీ అతను బీజేపీ కార్యకర్త కాదు. నా ప్రతినిధి కాదు. విషయం తెలిసి ముఖ్య మంత్రితో మాట్లాడాను.
నిందితుడీ పై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు. అయితే కేదార్‌నాథ్‌తో ప్రవేశ్‌ సంబంధాలను నిరూపించే కరపత్రాలు, బ్యాన ర్లు, పోస్టర్లు, ఇతర పత్రాలు సామాజిక మాధ్య మాల లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రవేశ్‌ తండ్రి రామ్‌ శంకర్‌ శుక్లా విలేకరులతో మాట్లాడుతూ తన కుమా రుడు ఎమ్మెల్యేకు సహాయకుడేనని స్పష్టం చేశారు. గత నాలుగైదు సంవత్సరాలుగా అతను ఎమ్మెల్యే ప్రతినిధిగా పని చేస్తున్నాడని తెలిపారు.
కాగా నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ తెలిపారు. ఇది దురదృష్టకరమైన సంఘటన అని చెప్పారు. అయితే కేసును కప్పిపుచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
బీజేపీకి ఎదురుదెబ్బే
ఈ సంవత్సరం చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించాలని తహతహలాడు తున్న బీజేపీలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. గత కొంతకాలంగా కోల్పోతున్న గిరిజనుల విశ్వాసా న్ని తిరిగి పొందేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నా లకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. 2018 ఎన్నికలలో రాష్ట్రంలోని 47 ఎస్టీ స్థానాలలో బీజేపీ 16 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. 2013లో ఆ పార్టీకి 31 ఎస్టీ రిజర్వ్‌డ్‌ సీట్లు లభించాయి. బీజేపీ ప్రయత్నాలపై ఈ ఘటన నీళ్లు చల్లిందని పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్‌ పాత్రికేయుడు ఒకరు తెలిపారు. బీజేపీని ఈ సంఘటన చాలా కాలం వెంటాడుతుందని వ్యాఖ్యానించారు.

Spread the love