‘ఇండియా వర్సెస్‌ మోడీ’

– పార్లమెంట్‌లో నినాదాల హోరు
– ఉభయ సభలు వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పార్లమెంటును మణిపూర్‌ అంశం కుదిపేస్తోంది. మోడీ ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలతో పాటు బీఆర్‌ఎస్‌ ఎంపీలు కూడా గురువారం నల్ల దుస్తులతో పార్లమెంటుకు హాజరై నిరసన తెలిపారు. మణిపూర్‌పై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడాల్సిందేనని పట్టుపట్టారు. హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌పై చర్చించాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళన ఉభయ సభల్లోనూ కొనసాగింది. ప్రతిపక్షాల ఆందోళన కొనసాగుతుండగానే కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ప్రధాని మోడీ విదేశీ పర్యటనపై ప్రకటన చేశారు. లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టేందుకు ప్రయత్నించారు. మణిపూర్‌ అంశంపై ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించడంతో పాటు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. మోడీ మౌనాన్ని వీడి నోరు విప్పాలని నినాదాలు చేస్తుంటే బీజేపీ సభ్యులు ప్రతిగా ‘మోడీ…మోడీ’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ప్రారంభమైన ఆరు నిమిషాల వ్యవధిలోనే స్పీకర్‌ సభను మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. గందరగోళం మధ్యే బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ ఖనిజాల చట్టానికి సవరణ బిల్లును, వినియోగ వ్యవహారాల మంత్రి పీయుష్‌ గోయల్‌ జన్‌ విశ్వాస్‌ (నిబంధనల సవరణ) బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం సభ సాయంత్రం మూడు గంటల వరకూ వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ‘మాకు న్యాయం కావాలి’ అంటూ నినాదాలతో హౌరెత్తించారు. జన్‌ విశ్వాస్‌ బిల్లుపై బీజేపీ ఎంపీలు రాజేంద్ర అగర్వల్‌, వైసీపీ ఎంపీ భీశెట్టి సత్యవతి, బీఎస్పీ ఎంపీ మలూక్‌ నగర్‌ మాట్లాడిన తరువాత మూజువాణీ ఓటుతో ఆమోదించారు. అనంతరం సభ శుక్రవారం నాటికి వాయిదా పడింది.
రాజ్యసభలో ప్రతిపక్షాల వాకౌట్‌
రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. దీంతో సభను ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. తొలుత సభలో మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ప్రయత్నించగా అధికార పక్ష సభ్యులు అడ్డుకున్నారు. దీనిని నిరసిస్తూ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొని, మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభం కాగానే ప్రతిపక్షాల ఆందోళన మధ్యే కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ సినిమాటోగ్రఫీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేంద్రం మంత్రి చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు వాకౌట్‌ చేశాయి. సినిమాటోగ్రఫీ బిల్లుపై బీజేడీ, బీజేపీ, అన్నా డీఎంకే, వైసీపీ, టీడీపీ, టీఎంసీ (ఎం) సభ్యులతో పాటు కేంద్ర మంత్రి రాందాస్‌ అథావలే మాట్లాడారు. బిల్లు మూజువాణీ ఓటుతో ఆమోదం పొందిన తర్వాత సభ శుక్రవారం నాటికి వాయిదా పడింది.
నినాదాల హోరు
మణిపూర్‌ హింసపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్షాలు, దానికి ప్రతిగా బీజేపీ సభ్యులు రాజ్యసభలో పోటాపోటీగా నినాదాలు చేశారు. విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ సభలో ప్రసంగిస్తున్న సమయంలో గందరగోళం చోటుచేసుకుంది. ప్రతిపక్షాలు ‘ఇండియా…ఇండియా’ అంటూ ప్రధానిని విమర్శిస్తూ నినాదాలు చేయగా అధికార పక్ష సభ్యులు ‘మోడీ…మోడీ’ అంటూ ప్రతి నినాదాలు చేశారు.

మణిపూర్‌కు ప్రతిపక్ష ఎంపీలు
– 29,30 తేదీల్లో పర్యటన
మణిపూర్‌లో అల్లర్లు ప్రారంభమై దాదాపు 85 రోజులు కావస్తున్నా హింస మాత్రం ఆగడం లేదు. దీనిపై ప్రధాని మోడీ మాట్లాడడం కానీ, ఆ రాష్ట్రంలో పర్యటించడం కానీ జరగలేదు. దీంతో ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు మణిపూర్‌కు వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఈ నెల 29, 30 తేదీల్లో మణిపూర్‌లో ప్రతిపక్ష ఎంపీలు పర్యటించనున్నారు.
india-vs-modi

Spread the love