విల్నియస్ లో జరిగిన 31నాటో దేశాల శిఖరాగ్ర సభ విడుదల చేసిన సంయుక్త ప్రక టన మూడవ ప్రపంచ యుద్ధానికి రచించిన ప్రణాళికలా ఉంది. 24పేజీల సంయుక్త ప్రకటనలో నాటో శిఖరాగ్ర సభ చర్చించవలసిన ప్రధాన సమస్యగావున్న ఉక్రెయిన్ యుద్ధం గురించి నామమాత్ర ప్రస్తావనే ఉంది. ప్రకటనలోని మిగిలిన భాగమంతా యావత్ ప్రపంచంపైన అమెరికా నేత్రుత్వంలో నాటో చెలాయిస్తున్న ఆధిపత్యాన్ని కొనసాగించటం ఎలా అనే విషయంపైనే ఉంది. నాటో ”360-డిగ్రీల విధానం” పేరుతో విడుదల చేసిన ఈ డాక్యుమెంట్ ఏ ఖండాన్ని, ఏ ప్రాంతాన్ని వదలలేదు.
డాక్యుమెంట్‌లోని తొలి భాగాలలో రష్యాతో ఘర్షణ గురించిన వివరణ ఉంది. ఉక్రెయిన్ యుద్ధాన్ని చర్చల ద్వారా పరిష్కరించటమనే మార్గాన్ని కొట్టిపారేశారు. ”ఎటువంటి షరతులు లేకుండా రష్యా పూర్తిగా ఉపసంహ రించుకుంటేనే” ఉక్రెయిన్‌లో శాంతి నెలకొంటుందని నాటో తేల్చింది. మీడియా కవరేజ్ చాలావరకు ”ఉక్రెయిన్ భవిత నాటోలోనే” అనే విష యంపైనే ఉంది. అయితే ఉక్రెయిన్ కు నాటోలో ఎప్పుడు సభ్యత్వం వస్తుం దనే ప్రశ్నకు నాటో దేశాల సంయుక్త ప్రకటనలో సమాధానం లేదు. ఉక్రె యిన్‌కు సభ్యత్వం ఇస్తే ‘ఒక దేశంపైన దాడి జరిగితే అన్ని సభ్య దేశాలపైన జరిగినట్టే’ అనే ఆర్టికల్ 5 ప్రకారం నాటో రష్యాతో యుద్ధానికి దిగవలసి వస్తుంది. దానితో అమెరికా రష్యాతో యుద్ధానికి తలపడటం లేదని అమెరికా ప్రజలకు అధ్యక్షుడు చెబుతున్న పిట్టకథలకు ముగింపు పలకవలసి వస్తుంది.
అయితే ఈ లీగల్ టెక్నికాలిటీని సందేహాస్పదంగా ఉంచటమంటే ఉక్రెయిన్ యుద్ధాన్ని నాటో తీవ్రతరం చేయదని కాదు. రష్యాతో యుద్ధాన్ని కొనసాగించటానికి ఉక్రెయిన్ కు నాటో దేశాల నుంచి అపరిమితమైన ఆయుధ సరఫరా, ఆర్థిక మద్దతు అందుతూనే ఉంది. అమెరికా, జర్మనీ, ఇతర నాటో దేశాలు ఉక్రెయిన్ కు పూర్తిస్థాయి మద్దతును ఇస్తామని హామీ ఇచ్చాయి. నాటోలో లేని జపాన్ తో సహా అన్ని జి-7 దేశాలు సమావేశానికి హాజరయి ఉక్రెయిన్ కు అత్యాధునిక ఆయుధాలతోసహా విస్త్రుతంగా సహాయం చేస్తామని మాట ఇచ్చాయి.
ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం ప్రకటించేలా రెచ్చగొట్టిన అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్ నాశనమౌతున్నా, ప్రజలు లక్షలాదిగా మరణిస్తున్నా పట్టించుకోకుండా ప్రపంచ వ్యాప్తంగా సైనిక సన్నద్దతను పెంచటానికి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉపయోగిస్తున్నాయి. ఇప్పటికే రష్యాతో ఘర్షణ ఐరోపా వ్యాప్త స్వభావాన్ని సంతరించుకుంది. తూర్పు ఐరోపాలో సైనిక దళాలు, ఆయుధాల తరలింపుకు సంబంధించిన యుద్ధ ప్రణాళికను 4000 పేజీల లో వివరించటం గమనార్హం.
నాటో ర్యాపిడ్ రియాక్షన్ సైన్యాన్ని 40,000 నుంచి 3,00,000కు పెంచనున్నారు. సమిష్టి రక్షణ పేరుతో ఈ 360 డిగ్రీల విధానాన్ని రూపొందించినట్టు నాటో సంయుక్త ప్రకటన పేర్కొంది.
గత సంవత్సరం మాడ్రిడ్‌లో జరిగిన నాటో శిఖరాగ్ర సభలో రష్యా ముట్టడికి ప్రణాళికను రచించారు. ఫిన్ లాండ్, స్వీడెన్ లను నాటోలోకి ఆహ్వానించి నాటో సైన్యాన్ని, సైనిక వ్యయాన్ని పెద్ద ఎత్తున పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ నిర్ణయాలు చాలావరకు అమలౌతున్న ట్టున్నాయి. ఫిన్ ల్యాండ్ నాటో సభ్యురాలయింది. స్వీడెన్ నాటో సభ్యదేశం కావటానికి అడ్డంకులు తొలిగాయి. దీనితో రష్యాతో నాటో దేశాల సరిహద్దు రెండు రెట్లయింది. సెయింట్ పీటర్స్ బర్గ్ నాటో సరిహద్దుకు కేవలం 150 కిలోమీటర్ల దూరంలోకి వచ్చింది. బాల్టిక్ సముద్రంలో రష్యా ఒక మూలకు నెట్టబడింది. అది నాటో సముద్రంగా మారింది.
ప్రపంచ ఆధిపత్యం కోసం నాటో రచించిన ప్రణాళికలో రష్యతో ఘర్షణ ఒక భాగం మాత్రమే. నాటో సంయుక్త ప్రకటన ద్రుష్టి ప్రధానంగా చైనా పైన కేంద్రీకరింపబడింది. చైనా ”ఒక విస్త్రుత రాజకీయ, ఆర్థిక, సైనిక సాధనాల ద్వారా ప్రపంచంలో తన పాద ముద్రలను, ప్రాబల్యాన్ని పెంచు కుంటోంది. తన దుర్మార్గపు సైబర్ ఆపరేషన్లతో, ఘర్షణపడే ధోరణితో, తప్పుడు సమాచారంతో నాటో దేశాల భద్రతకు ప్రమాదంగా పరిణమిస్తోంది.
ప్రధాన సాంకేతిక, పారిశ్రామిక రంగాలను, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యూహాత్మక ఖనిజాలను, సరఫరా చైన్లను నియంత్రించే ప్రయత్నం చేస్తోంది” అని నాటో దేశాల సంయుక్త ప్రకటన పేర్కొంది. ”చైనా, రష్యాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం చట్టబద్దమైన అంతర్జాతీయ క్రమాన్ని, మన విలువలను నిర్వీర్యం చేయటానికి, ప్రయోజనాలను దెబ్బతీయటానికి ప్రయత్నిస్తోంది” అని నాటో శిఖరాగ్ర సభ విడుదల చేసిన సంయుక్త ప్రకటన పేర్కొంది.
సామ్రాజ్యవాద దేశాలు స్రుష్టించే డాక్యుమెంట్ల వలెనే ఈ నాటో దేశాల శిఖరాగ్ర సభ విడుదల చేసిన సంయుక్త ప్రకటన కూడా పూర్తిగా కపటత్వం కూడి ఉంది. ఉక్రెయిన్ జాతీయ ”సార్వభౌమత్వాన్ని, ప్రాంతీయ సమగ్రతను” రక్షించటం గురించి మాట్లాడే సామ్రాజ్యవాద దేశాలకు ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో దేశాలపైన దురాక్రమణ యుద్ధాలు చేసిన చరిత్ర ఉంది. ఉక్రెయిన్ కు నాటోలో చేరే హక్కు ఉందని వాదించే నాటో దేశాలు చైనా, రష్యాలకు అలా భాగస్వాములయ్యే హక్కును తిరస్కరిస్తు న్నాయి. ఉక్రెయిన్ కు అపరిమితంగా ఆయుధాలను సరఫరా చేయటం హక్కుగా భావిస్తున్న నాటో దేశాలు రష్యా కు ఎటువంటి సైనిక సహాయం చేసినా అది యుద్ధ చర్యగా ఎలా భావిస్తున్నాయో తెలియదు.
మధ్యప్రాచ్చం, ఆఫ్రికా, ఇండో-పసిఫిక్ ప్రాంతాలు నాటో వ్యూహాత్మక ప్రయోజనాలున్న ప్రాంతాలుగా నాటో సంయుక్త ప్రకటన పేర్కొంది. నాటో దేశాలకు ఈ ప్రాంతాలు సరిహద్దులు ఎలా అవుతాయో ఈ దేశాలకే తెలియాలి. ఆర్కిటిక్, ఔటర్ స్పేస్, సైబర్ స్పేస్ లలో కూడా నాటోకు భద్రత కావాలట. ఒక చిన్న సైబర్ దాడిని కూడా సమిష్టి భద్రతకు ముప్పు గా పరిగణించి నాటో దేశాలు యుద్ధానికి దిగే అవకాశం ఉంది.
విల్నియస్ డాక్యుమెంటులో ప్రవచించినట్టు యావత్ ప్రపంచంపైన నాటో ద్రుక్పథాన్ని రుద్దాలను కోవటం వెర్రితనమే అవుతుంది. ఇది సంక్షుభిత పాలక వర్గాల వెర్రితనం. విల్నియస్ శిఖరాగ్ర సభలో కత్తులు దూసి బెదిరింపులకు దిగిన నాటో సభ్య దేశాలన్నీ తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నవే. వీటిలోని ప్రధాన సామ్రాజ్యవాద దేశాలన్నీకార్మికుల, యువతీయువకుల నిరసనలతో అట్టుడుకుతున్నవే. జర్మనీ, ఫ్రాన్స్ వంటి అనేక నాటో కూటమి దేశాలలో యుద్ధాలపట్ల ప్రజల్లో ఏర్పడిన ఏహ్యభావం ఉద్యమాల రూపం తీసుకుంటోంది. అంతిమంగా ప్రజల చేతుల్లో నాటో కూటమి సామ్రాజ్యవాదం మట్టిగరవటం అనివార్యమని చరిత్ర మరోసారి రుజువుచేయనుంది.
నెల్లూరు నరసింహారావు