గోరక్షకుల దాష్టీకం

  ఇద్దరు ముస్లింల అపహరణ..హత్య
– హర్యానాలో కాలిపోయిన కారులో శవాలు లభ్యం
–  నిందితులు బజరంగ్‌ దళ్‌ సభ్యులు
– ఘటనను ఖండించిన రాజస్థాన్‌ సీఎం
జైపూర్‌ : గోరక్షకులు దారుణానికి తెగబడ్డారు. రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు ముస్లింలను అపహరించారు. ఆ తర్వాతి రోజు ఆ ఇద్దరు హర్యానాలోని ఒక కారులో శవాలుగా కనిపించారు. ఇది బజరంగ్‌దళ్‌కు చెందినవారి పనేనని మృతుల కుటుంబసభ్యులు ఆరోపించారు. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి 12 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ఈ దారుణ ఘటనను ఖండించారు. పోలీసులు, మృతుల కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులు ఇద్దరు నజీర్‌ (25), జునైద్‌ అలియాస్‌ జునా (35) లు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లా ఘట్మీకా గ్రామానికి చెందినవారు. బుధవారం కొందరు దుండగులు వచ్చి నజీర్‌, జునాలను ఎత్తుకెళ్లిపోయారు. ఆ తర్వాతి రోజు గురువారం ఉదయం ఆ ఇద్దరు హర్యానాలోని లొహరులో ఒక కారులో శవాలుగా కనిపించారు. ఆ కారు కాలిపోయిన స్థితిలో ఉండటం గమనార్హం. ఈ ఘటనపై మృతుల కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. నజీర్‌, జునాలను అపహరించుకుపోయిన వారు బజరంగ్‌దళ్‌కు చెందినవారు అని తమ ఫిర్యాదులో పేర్కొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి 12 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని భరత్‌పూర్‌ రేంజ్‌ ఐజీ గౌరవ్‌ శ్రీవాస్తవ అన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్లు నమోదైనవారు బజరంగ్‌ దళ్‌కు చెందినవారేననీ తెలిపారు. నిందితులపై ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు భరత్‌పూర్‌ జిల్లా ఎస్పీ శ్యామ్‌ సింగ్‌ చెప్పారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు. ఈ ఘటనపై రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ స్పందించారు. ఘటనను ఖండిస్తున్నట్టు ట్వీట్‌ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని రాజస్థాన్‌ పోలీసులను ఆదేశించినట్టు చెప్పారు. రాష్ట్ర మంత్రి ఝహీదా ఖాన్‌ ఘట్మీకా గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ దారుణ ఘటనను మైనారిటీ లీడర్లు, సామాజికవేత్తలు, పౌరహక్కుల కార్యకర్తలు ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలనీ, హిందూత్వ శక్తుల ఉన్మాద చర్యలకు అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు. కాషాయమూకలు శాంతియుతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టి ప్రజల మధ్య మతపరంగా విభేదాలు తెచ్చే కుట్రలకు తెరలేపుతున్నారనీ, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Spread the love