వాషింగ్టన్, బ్రస్సెల్స్: అమెరికా, ఐరోపా దేశాలను సమ్మెలు, నిరసనలు కుదిపేస్తున్నాయి. విపరీతంగా పెరిగిపోతున్న ధరలొకవైపు, పడిపోతున్న నిజ వేతనాలు, అంతులేని నిరుద్యోగం ఇంకొకవైపు దీంతో ఆగ్రహించిన ప్రజానీకం ఎక్కడికక్కడ వీధుల్లోకి వస్తున్నారు. ఇదివరకెన్నడూ లేని విధంగా నిరసనలు, ఆందోళనలతో ఈ దేశాలు అట్టుడుకుతున్నాయి. మెరుగైన వేతనాలు, ఉపాధి కోసం కార్మికులు అనేక చోట్ల్ల సమ్మెలకు దిగుతున్నారు. ఇటీవల కాలంలో యూరప్‌లో సమ్మెలు, నిరసనలు సర్వసాధారణమైపోయాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆందోళనలు పెరగడమే కాదు, వాటి తీవ్రత కూడా పెరిగింది. అమెరికాలో ఈ ఏడాది ఇప్పటివరకూ 230 సమ్మెలు జరిగాయి. 3,20,000మందికి పైగా కార్మికులు సమ్మెల్లో పాల్గొన్నారు. సమ్మెలు, పికెటింగ్‌లు, ఇతర రూపాల్లో నిరసనలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బాగా పెరిగాయని అమెరికా లేబర్ బ్యూరో, కార్నెల్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఇండిస్టియల్ అండ్ లేబర్ రిలేషన్స్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎయిర్‌లైన్స్, రైల్వేస్, పోస్టల్, కొరియర్ సర్వీసెస్, కార్ల తయారీదార్లు, నర్సులు, టీచర్లు, హాలీవుడ్ రైటర్లు, నటులు ఇలా అన్ని రంగాలకు చెందిన వారు సమ్మె బాటపట్టారు. ఉపాధి భద్రతలో సంక్షోభం నెలకొనడం, పని పరిస్థితులు, జీవన పరిస్థితులు మరింత దారుణంగా మారడం, మరోవైపు కంపెనీ లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీలకు, అలాగే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మికవర్గం వీధుల్లోకి వస్తోంది. ఈ క్రమంలో కార్మికవర్గం కొన్ని విజయాలు సాధించింది. ఒప్పందాలు కుదిరాయి. అమెరికా కార్మిక శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2022లో 23సార్లు సమ్మెలు చోటు చేసుకున్నాయి. 2009లో కేవలం అయిదు సార్లు సమ్మె జరగ్గా, గతేడాది అది 23కి పెరిగింది.
యూరప్‌లో స్తంభించిన రవాణా
యూరప్‌లో ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మెలు, పని నిలుపుదల కారణంగా వందలాది విమానాలు నిలిచిపోయాయి. రైళ్లు, ప్రభుత్వ రవాణా స్తంభించిపోయింది. కొత్త పెన్షన్ పథకం, రిటైర్‌మెంట్ వయసు పెంచాలన్న ఫ్రాన్స్ ప్రభుత్వ ప్రతిపాదనలను నిరసిస్తూ అక్కడ తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరిగాయి. భద్రత, ఇతర రంగాల కార్మికులు తమ కార్యకలాపాలను నిలుపుచేయడంతో జర్మనీలోని బెర్లిన్, ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయాల్లో విమాన సర్వీసులు రద్దయ్యాయి. తక్కువ వేతనాల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ బ్రిటన్‌లో రైల్వే కార్మికులు మూడుసార్లు సమ్మెకు దిగారు. కొన్ని యురోపియన్ దేశాల్లో వాకౌట్లు, సమ్మెలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. నయా ఉదారవాద విధానాల అమలు తీవ్రం కావడంతో పడుతున్న భారాలు, యాజమాన్యాలు అనుసరిస్తున్న విధానాల వల్ల కార్మికవర్గం భారీ ఎత్తున ఆందోళనలకు దిగుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు.