ఎటిటర్స్‌ గిల్డ్‌పై కేసు

– మీడియా వాణిని అణచివేస్తున్న మణిపూర్‌ ప్రభుత్వం
ఇంఫాల్‌: మీడియా వాణిని అణచివేసేందుకు బీజేపీ నేతృత్వంలోని మణిపూర్‌ ప్రభుత్వం యత్నిస్తున్నది. ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఈజీఐ)కి చెందిన నిజ నిర్థారణ బృందంపై సోమవారం మణిపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) చట్టంలోని 66ఏ కింద ఈజీఐపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. గత మూడు నెలలకు పైగా మణిపూర్‌లో రెండు కమ్యూనిటీల మధ్య నెలకొన్న ఘర్షణలపై ఈజీఐ మీడియా నివేదికను విడుదల చేసింది. మణిపూర్‌లో మరిన్ని హింసాత్మక పరిస్థితులకు దారితీసేలా ఈ నివేదిక ఉందంటూ… ఈజీఐపై కేసు నమోదు చేయాల్సిందిగా మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌ సింగ్‌ పోలీసులను ఆదేశించారు. మరోవైపు ఐటీ చట్టంలోని 66ఏను 2015లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సెక్షన్‌ కింద పౌరులను హింసించడాన్ని నిలిపివేయాలని అన్ని రాష్ట్రాల పోలీసులను హెచ్చరించింది. అయితే మణిపూర్‌ పోలీసులు ఈ ఆదేశాలను బేఖాతరు చేయడం గమనార్హం. మీడియా స్వేచ్ఛను, ఎడిటోరియల్స్‌ నాయకత్వ ప్రమాణాలను పెంపొందించేందుకు 1978లో నెలకొల్పబడిన ఈజీఐ మణిపూర్‌ హింసాకాండపై ఆదివారం ఓ నివేదికను విడుదల చేసింది. బీరేన్‌సింగ్‌ ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తున్నదనీ, ఇంఫాల్‌లో మీడియా మొత్తం మొయితీ కమ్యూనిటీకి అనుకూలంగా మారిందని పేర్కొంది. మణిపూర్‌ పోలీసులు, కమాండో విభాగాలు కూడా పక్షపాతంతో వ్యవహరిస్తున్నాయని నివేదిక తెలిపింది. బహిరంగంగా మొయితీ పక్షం వహించడంతో పాటు ఇంఫాల్‌ శివార్లలోని కుకీ గ్రామాలపై దాడికి దిగాయని వెల్లడించింది. నేడు పరిపాలన కూడా జాతుల వారీగా విభజించబడిందని పేర్కొంది.

Spread the love