బీబీసీపై ప్రతీకారం

–  ఢిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ సోదాలు
–  పాత్రికేయుల ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం
–  కేంద్ర దర్యాప్తు సంస్థలతో సర్కార్‌ కక్ష సాధింపు
–  అబ్బే..ఇది కేవలం ఐటీ సర్వే : సంబంధిత అధికారులు
–  ఐటీ అధికారులకు సహకరిస్తున్నాం : బీబీసీ
– మోడీ సర్కార్‌పై ప్రతిపక్షాల ఆగ్రహం
– అదానీ అక్రమాలపై విచారణ లేదు..ఎందుకు? :ప్రతిపక్షాలు
అదానీ వ్యవహారంలో వాస్తవాలు బయటకు రావాలని దేశం యావత్తు కోరుకుంటుంటే… కేంద్రం మాత్రం బీబీసీని టార్గెట్‌ చేసింది. అదానీ గ్రూప్‌ ఆర్థిక అవకతవకలు, అక్రమాలపై విచారణ జరపకుండా.. పాలకులకు వ్యతిరేకంగా వార్తా కథనాలు రాసిన మీడియా సంస్థలపైకి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ప్రయోగిస్తున్నది. మంగళవారం బీబీసీ కార్యాలయాలపై ఐటీ సర్వేలు, దాడులు దేశ రాజకీయాల్లో సంచలనం రేపాయి. ఐటీ, సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తూ మీడియా సంస్థల్ని బెదిరిస్తోందని ‘ద ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా’ ఆందోళన వ్యక్తం చేసింది. బీబీసీలో ఐటీ సోదాలు..
న్యూఢిల్లీ : గుజరాత్‌ అల్లర్లపై సంచలనాత్మక డాక్యుమెంటరీ రూపొందించిన బ్రిటీష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ (బీబీసీ)పై మోడీ సర్కార్‌ ప్రతికార చర్యలకు దిగింది. భారత్‌లోని బీబీసీ కార్యాలయాలపై మంగళవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. బీబీసీ-ఢిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ అధికారులు సర్వే నిర్వహించారని జాతీయ మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి. పన్ను ఎగవేత ఆరోపనలపై ఈ దర్యాప్తు సాగుతుతోందని తెలిసింది. బీబీసీలో పనిచేస్తున్న సిబ్బంది ఫోన్లను ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సిబ్బంది ఎవర్నీ బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. సోదాలు మొదలైన కొద్ది గంటలకు కొంతమందిని వారి ఇండ్లకు పంపినట్టు వార్తలు వెలువడ్డాయి. ఐటీ దాడుల వ్యవహారంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ”ఇది కేవలం సర్వే మాత్రమే. ఐటీ దాడులు కాదు” అని ఐటీ అధికారులు మీడియాకు తెలిపారు. పన్నుల అవకతవకల ఆరోపణలపై ఈ సర్వే నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఉద్యోగులు కంప్యూటర్లు వాడొద్దని, ఇంట్లోనే ఉండాలని అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. పాత్రికేయుల ఫోన్లను, ల్యాప్‌ట్యాప్లను కూడా స్వాధీనం చేసుకున్నారని సమాచారం. అవకతవకలకు సంబంధించి ఏవైనా ఆధారాలు గుర్తిస్తే, ఈ సర్వేను కాస్తా ఐటీ సోదాలుగా మార్చే అవకాశముందని సంబంధిత అధికారుల్లో ఒకరు మీడియాకు చెప్పారు. తమ కార్యాలయాల్లో ఐటీ విభాగం నిర్వహిస్తున్న సర్వేపై బీబీసీ స్పందించింది. ”ప్రస్తుతం ముంబయి, ఢిల్లీలోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ అధికారులున్నారు. మేం వారికి సహకరిస్తున్నాం. ఈ వ్యవహారం త్వరలోనే సద్దుమణుగుతుందని ఆశిస్తున్నాం” అని ట్వీట్‌ చేసింది.
డాక్యుమెంటరీ ప్రసారం చేసిందనే
గుజరాత్‌ 2002 మత ఘర్షణలకు బాధ్యుడు ఆనాటి సీఎం నరేంద్రమోడీయేనని పేర్కొంటూ బీబీసీ రెండు భాగాలుగా ఒక డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. ఇది భారత్‌లోనూ, విదేశాల్లోనూ సంచలనం సృష్టించింది. పాలకుల మద్దతు, వారి ప్రోద్బలంతోనే మైనార్టీలు లక్ష్యంగా హింసాకాండ చెల రేగిందని డాక్యుమెంటరీలో చూపారు. ఈ డాక్యుమెంటరీ మనదేశ రాజకీయాల్ని తీవ్రంగా కుదిపేసింది. ఈ డాక్యుమెంటరీ భారత్‌లో విడుదల చేయరాదని మోడీ సర్కార్‌ ఆంక్షలు విధించింది. దాంతో బీబీసీ వెబ్‌సైట్‌ నుంచి కొద్ది గంటల్లోనే వీడియోను తొలగించారు. అయితే ‘ఇండియా : ద మోడీ క్వశ్చన్‌’ అనే ఈ డాక్యుమెంటరీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సామాజిక మాధ్యమా ల్లోనూ దీనిని ప్రసారం చేయవద్దని, దీనికి సంబంధించిన ట్వీట్లను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం జనవరి 21న ఆదేశించింది. ఈ వ్యవహరంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న మోడీ సర్కార్‌ ప్రతీకార చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. వ్యాపార కార్యకలాపాలు జరిగే ప్రదేశాల్లో మాత్రమే ఐటీ సర్వే నిర్వహిస్తారని తెలుస్తోంది. బీబీసీ డాక్యుమెంటరీని అడ్డుకునేందుకు కేంద్రం ప్రయత్నించి నప్పటికీ, దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో వీడియోను ప్రదర్శించారు. ఈ డాక్యు మెంటరీ ప్రసారంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఆందోళన కలిగించే విషయం : ఎడిటర్స్‌ గిల్డ్‌
బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడుల్ని ‘ద ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా’ (ఈజీఐ) తీవ్రంగా ఖండించింది. ఇది అత్యంత ఆందోళన కలిగించే విషయంగా పేర్కొంది. మీడియా సంస్థలపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వ విధానాల్ని విమర్శిస్తే..ప్రతీకార ధోరణితో కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు దాడులకు దిగుతున్నాయని ఈజీఐ అభిప్రాయపడింది. మీడియా సంస్థల్ని లక్ష్యంగా చేసుకొని పదే పదే బెదిరింపులకు పాల్పడుతున్నాయని ఆరోపించింది.
ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం – జర్నలిస్టు సంఘాల ఆగ్రహం
ఐటీ దాడులపై నేషనల్‌ ఎలియన్స్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (ఎన్‌ఏజే), ఢిల్లీ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (డీయూజే) తీవ్ర ఆందోళన వ్యక్తంచేశాయి. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చ రించాయి. ప్రభుత్వ ఏజెన్సీ లను ఉపయోగించుకుని ప్రభుత్వ విధానాలను విమర్శించేవారిని భయపెట్టే ధోరణికి ఈ దాడులు కొనసాగింపేనని తెలిపాయి. జర్నలిస్టులు, మీడియా సంస్థల హక్కులను ప్రభు త్వం కాలరాస్తున్నదని విమర్శించాయి. గుజరాత్‌ లో 2002లో జరిగిన హింసాకాండ, భారతదేశంలోని మైనారిటీల ప్రస్తుత స్థితిగతు లపై బీబీసీ రెండు డాక్యుమెంటరీలను ప్రసారం చేసిన నేపథ్యంలోనే ఈ దాడులు జరిగాయని స్పష్టం చేశాయి. ప్రభుత్వ విధానాలను విమర్శించిన న్యూస్‌క్లిక్‌, న్యూస్‌ లాండ్రీ, దైనిక్‌ భాస్కర్‌, భారత్‌ సమాచార్‌ కార్యాలయాల్లోనూ 2021లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశాయి. స్వతంత్ర మీడియాను బెదిరించే సాధనాలుగా ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నదనీ, వెంటనే దీనికి కట్టడిచేయాలని డిమాండ్‌చేశాయి. ఈ దాడులు స్వతంత్ర ఆలోచనలను అరికట్టడానికి, అప్రకటిత పత్రికా సెన్సార్‌షిప్‌కు, జర్నలిజంపై నియంత్రణకు పరాకాష్ట అని మీడియా సంస్థలు విమర్శించాయి..

Spread the love