త్రిపురలో గూండాగిరి..

– ప్రతిపక్షాల మద్దతుదారులే లక్ష్యంగా బెదిరింపులు
– కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుసుకున్న సీపీఐ(ఎం) నాయకులు
– స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితి లేదు : సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : త్రిపురలో ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛగా జరిగే పరిస్థితులు లేవని సీపీఐ(ఎం) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిపక్షాల మద్దతుదారులే లక్ష్యంగా అధికార బీజేపీ హింస, బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈమేరకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యుడు నీలోత్పల్‌ బసు, సెంట్రల్‌ సెక్రటేరియట్‌ సభ్యుడు మురళీధరన్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుసుకుంది. త్రిపుర ఓటర్లలో అత్యధిక మంది స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితి లేదని వారు ఈసీకి తెలిపారు. ఇటీవల త్రిపురకు పెద్ద సంఖ్యలో మోటార్‌ సైకిళ్లు దిగుమతి అయ్యాయని, వీటిపై అధికార బీజేపీకి చెందిన గూండాలు ప్రయాణిస్తూ గ్రామాల్లో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. వామపక్షాలకు బలమున్న ప్రాంత్రాల్లో, గ్రామాల్లో పర్యటిస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఈసీకి విన్నవించారు. ”ఓటర్లను ప్రలోభపెట్టడానికి, బెదిరించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో గ్యాంగులుగా ఏర్పడ్డ కొంతమంది బీజేపీ కోసం పనిచేస్తున్నారు. ప్రతిపక్షాల వైపు ఉంటారనే వారిని లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీనిని వెంటనే ఆపాలి. పెద్ద పెద్ద రోడ్లపైన్నే కాదు, అంతర్గత రోడ్లపైనా మోటార్‌ సైకిళ్ల ర్యాలీలపై నియంత్రణలు విధించాలి. ఓటర్లలో విశ్వాసాన్ని నింపాల్సిన బాధ్యత ఈసీపై ఉంది” అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రతినిధుల బృందం కోరింది. త్రిపుర ఎన్నికలపై తమ దృష్టికి తీసుకొచ్చిన విషయాలపై విచారణ జరుపుతామని, స్వేచ్ఛగా, శాంతియుతంగా ఎన్నికలు జరిగేట్టు చర్యలు చేపడతామని కేంద్ర ఎన్నికల సంఘం సీపీఐ(ఎం) బృందానికి హామీ ఇచ్చింది.

Spread the love