అకాల వర్షంతో తడిసి ముద్దయిన ధాన్యం

నవతెలంగాణ – గోవిందరావుపేట

అకాల వర్షంతో రైతులు తడిసి ముద్దయ్యారు. మంగళవారం మండల వ్యాప్తంగా ఉదయం నుండి సాయంత్రం వరకు ఈదురు గాలులతో కూడిన చిరుజల్లులు పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు వేసవి ఎండ తీవ్రత నుండి ఉపశయనం పొందుతున్నామన్న ఆనందం ఏమాత్రం లేకుండా పోయిందని రైతులు అంటున్నారు. లక్నవరం ఆయకట్టు కింద వందలాది ఎకరాల్లో వరి పంట నేల వాలుతోందని గింజలు రాలిపోతున్నాయని పంటలు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని కోసిన ధాన్యాన్ని ఆరబోసే పరిస్థితులు లేకుండా ఉన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటనలతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. మూడు రోజులు ధాన్యాన్ని ఆరబోయకుండా ఉంటే కూడా కరాబు అవుతాయని రైతులు అంటున్నారు. కోయని పంట పొలాలు గింజలు ర్యాలీ నేల వాలి కోసుకునేందుకు అవకాశం లేకుండా పోతుందని అంటున్నారు. ఆరుకాలం కష్టపడి నోటి కాడికి వచ్చిన ముద్ద తినే యోగం లేకుండా పోయిందని రైతులు అభిప్రాయపడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంపై కవర్లు కప్పిన గాలులకు ఆగడం లేదని అంటున్నారు. ఈ నెలాఖరు వరకు వర్షం ఆగి ఉంటే పూర్తిస్థాయిలో యాసంగి పంట కాలు నుండి బయటపడిపోయే వాళ్ళమని ఇప్పుడు అకాల వర్షం నిండా ముంచుతుందని అంటున్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లించాలని వర్షం తగ్గిన వెంటనే సర్వే ప్రారంభించాలని రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Spread the love