ఓరుగల్లు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

నవతెలంగాణ – రాయపర్తి
పార్లమెంటు ఎన్నికల్లో ఓరుగల్లు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని   కేశవాపురం, ఎర్రకుంటా తండా, జింకురాం తండా, గ్రామాలలో పార్లమెంట్ ఎన్నికల నేపత్యంలో ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేకు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు, ప్రజలకు చేసిందేమి లేదని తెలిపారు. గత ఎన్నికల సమయంలో బీజేపీ నిరుద్యోగులకు ఉద్యోగాలకు ఇస్తామని హామీ ఇచ్చి నేటి వరకు కల్పించలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేశామన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని, అదే విధంగా పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని తుంగలో తొక్కినట్టే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి పార్టీకి చరమగీతం పాడాలని ఉపోద్ఘాటించారు. వరంగల్ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు అమ్య నాయక్, మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, మండల నాయకులు మాచర్ల ప్రభాకర్, ముద్రబోయిన వెంకన్న, గోవర్ధన్ రెడ్డి, నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love