అడవి జంతువుల వేటకై అమర్చిన విద్యుత్ వైర్ తగిలి యువకుడి మృతి

నవతెలంగాణ – గోవిందరావుపేట
అడవి జంతువుల వేటకై గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన విద్యుత్తు వైరు తగిలి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని దుంపలగూడెం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. పసర పోలీస్ స్టేషన్ పోలీసుల కథనం ప్రకారం దుంపలగూడెం గ్రామానికి చెందిన పిండి రమేష్ (28) తన స్నేహితుడు అనిల్ తో కలిసి ఆదివారం రాత్రి తప్పిపోయిన తన గొర్రెల మందలోని ఒక గొర్రెను వెతికేందుకు అడవికి వెళ్ళిన క్రమంలో, గుర్తుతెలియని వ్యక్తులు వన్యప్రాణుల వేటకై అమర్చిన విద్యుత్తు వైరు తగిలి సంఘటన స్థలిలోనే మృతి చెందారు. మృతుని తండ్రి సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం రమేష్ మృతదేహాన్ని ములుగు సామాజిక ఆసుపత్రికి తరలించారు. మృతునికి గత ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. మృతుని తల్లిదండ్రులు, భార్య రోధిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గత కొద్దిరోజుల క్రితం కూడా గ్రామంలో ఇలాంటి సంఘటన తలెత్తడంతో ఇది రెండవ సంఘటన కావడంతో, గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వన్యప్రాణుల వేటకై విద్యుత్తు వినియోగిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
Spread the love