మళ్లీ అధికారం కోసం బీజేపీ మతాన్ని పావుగా వాడుకుంటోంది : ఎస్ వీరయ్య

నవతెలంగాణ – గోవిందరావుపేట
రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఎలాగైనా గెలుపు సాధించాలని తిరిగి అధికారం చేపట్టాలని ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఓట్ల కోసం సీట్ల కోసం బీజేపీ హిందూ మతం పేరుతో ప్రజల్లో అసమానతలను సృష్టిస్తుందని సీపీఐ(ఎం) పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఎస్ వీరయ్య అన్నారు. సోమవారం మండలంలోని పసర గ్రామంలో పీఎస్ ఆర్ గార్డెన్స్ లో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం జిల్లా నాయకులు పొదిళ్ల చిట్టిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ వీరయ్య హాజరై మాట్లాడారు. గత పది సంవత్సరాలు భారతదేశంలో పరిపాలించిన బీజేపీ ఈసారి అధికారంలోకి రాలేమని గుబులుతో భయంతో నీతికి, న్యాయానికి తిలోదకాలు ఇచ్చి అధికారమే పరమావధిగా ఇతర పార్టీలను నాయకులను అణగదొక్కుతూ, జైలు పాలు చేస్తూ, ఇలాంటి దాడులతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ, అక్రమ నీతిని చాటుకుంటుందని అన్నారు. రైతుల సంక్షేమాన్ని గిట్టుబాటు ధరను పట్టించుకోని ప్రభుత్వం పూర్తిస్థాయిలో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ, పెట్టుబడిదారీ వ్యవసాయ రంగాన్ని, ప్రోత్సహించేందుకు సిద్ధపడి రైతులను కూలీలుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు.
          గతంలో దొంగ వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వానికి రైతులు బుద్ధి చెప్పినట్లే, ఈసారి కూడా ఎన్నికల్లో రైతులు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. బీజేపీ పాపాల పుట్టను కదిలించేందుకే ఇండియా కూటమి ఏర్పడిందని, మత చాందస వాదాన్ని తుద ముట్టించేందుకే అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వస్తున్నాయని, దీనితో బీజేపీ కథ కంచికి చేరుతుందని  అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ ప్రాబణ్యం లేని పార్టీగా బీజేపీ మిగిలిపోయిందని, ఉత్తరాది రాష్ట్రాల్లో గత రెండు పర్యాయములు ఎన్నుకున్న ప్రజలు ఈసారి విరక్తితో ఉన్నారని అన్నారు. ఓటమి నుంచి  గట్టెక్కేందుకు రాముడు, రామ మందిరం గుడి, మతం రంగుతో ప్రజల్లో మత వ్యాప్తిని పెంపొందించి, పూర్వకాలపు రాచరిక పరిపాలన తెచ్చేందుకు సిద్ధమైందని అన్నారు. 400 సీట్లు వస్తాయని, రాజ్యాంగాన్ని పూర్తిగా మారుస్తామని, మనోవాదాన్ని ఇస్తామని, బలుపు మాటలతో తన అహంకార ధోరణితో తన పతనాన్ని బీజేపీ తనే శాసించుకుంటుందని అన్నారు.
            కార్మిక చట్టాలను, వ్యవసాయ కూలీల చట్టాలను, అమలు పరచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. కార్మికులకు, కూలీలకు అన్యాయం చేస్తూ, ఆధునీకత పేరుతో అంబానీ,  ఆదానీలకు లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చిపెడుతోందని అన్నారు. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ప్రజలు బీజేపీపై విరక్తితో ఉన్నారని, ఓట్లు పడవని, సీట్లు రావని తెలిసి, మోడీ ఈడితో ఆటలాడుతున్నాడని అన్నారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన ప్రభుత్వానికి చలనం లేకపోవడంతో ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ, చదువులు, ఆరోగ్యం పట్టించుకోలేని ఈ బీజేపీ ప్రభుత్వానికి ఎలా ఓటు వేస్తామని ప్రజలు అంటున్నారని తెలిపారు.  పూర్తిస్థాయిలో ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్న బీజేపీ పార్టీని ఆ రాముడు కూడా కాపాడలేడని అన్నారు. పేద ప్రజానీకానికి ఇల్లు నిర్మించి ఇవ్వలేని మోడీ, రాముడికి గుడి కట్టినంత మాత్రాన ప్రభుత్వం ఏర్పాటు అవుతుందనుకోవడం మూఢ విశ్వాసానికి అద్దం పడుతుందని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా అన్ని సమస్యలకు రాముడే సమాధానం అన్నట్టుగా ప్రజలను తప్పుదారి పట్టించి, గుడి పేరుతో మత రాజ్యాన్ని తేవాలని, కుల వ్యవస్థను పెంచి పోషించాలని కుట్రలు పన్నుతోందని అన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించాలని బీజేపీ ఇతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి, కూటమిగా ఏర్పడుతుంటే రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం సోయి లేకుండా వ్యవహరిస్తుందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత రాహిత్యాన్ని త్వరలోనే గుర్తించి, బీజేపీ ఓటమి లక్ష్యంగా, స్పృహలోకి వస్తారని అప్పటివరకు వేచి చూస్తామని, బీజేపీ ఓటమిలో భాగంగా సీపీఐ(ఎం) పాత్రగా తన పాత్ర తాను పోషిస్తూ వెళుతుందని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు కవితను జైల్లో పెట్టిన బీజేపీని ఓడించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని అన్నారు. అంతేకానీ కాంగ్రెస్ పార్టీని త్వరలో పడగొడతామని, పడిపోతుందని అనడం ఎందుకని, పది సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్, ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష పాత్రలో ఉండలేరా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కలిసి వచ్చినా, రాకున్నా, సీపీఐ(ఎం) పార్టీ తమ వంతు పాత్ర పోషిస్తూ, బీజేపీ గెలుపును నిలువరించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని, తమతో కలిసిపోయే వాళ్ళతో మరింత ముందుకు సాగి బీజేపీ విజయాన్ని అడ్డుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, మండల కార్యదర్శి తీగల ఆగి రెడ్డి, జిల్లా నాయకులు బి రెడ్డి సాంబశివ, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు రత్నం రాజేందర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండి దావూద్, ఎటునాగారం కన్నాయిగూడెం మంగపేట వాజేడు మండలాల కార్యదర్శిలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love