– మతరాజ్యంగా మార్చే ప్రయత్నాలను ప్రతిఘటించాలి
– స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏచూరి
న్యూఢిల్లీ : దేశాన్ని లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిలుపుకునేందుకు పోరాటాన్ని బలోపేతం చేయాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం (ఏకేజీ భవన్)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీతారాం ఏచూరి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలనుకునే వారు పాలిస్తున్నారని విమర్శించారు. లౌకికవాదులు, ప్రజాస్వా మ్యవాదులు ప్రతిఘటించాలని సూచిం చారు. నాటి జాతీయోధ్యమంలో ఆ తర్వాత కూడా మతతత్వ ప్రాతిపదికన దేశ భవిష్యత్తును రూపొందించాలనే భావజాలం అందుకు తీవ్రంగా ప్రయత్నించిందని ఏచూరి ఎత్తిచూపారు. సుదీర్ఘ సైద్ధాంతిక పోరాటం తరువాత స్వతంత్ర భారతదేశాన్ని లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించారని తెలిపారు. కానీ మోడీ ప్రభుత్వం తిరిగి మతతత్వ అజెండాను దూకుడుగా అమలు చేస్తున్నదని విమర్శించారు. ద్వేషపూరిత ప్రచారంతో అల్లర్లు చెలరేగుతున్నాయనీ, మణిపూర్, హర్యానా ఇందుకు తాజా ఉదాహరణలని తెలిపారు. దేశాన్ని ప్రభావితం చేసే అంశాలను గౌరవించకుండా స్వాతంత్య్ర దినోత్సవం నాడు కూడా ప్రధాని మోడీ రాజకీయ ప్రసంగం చేశారని విమర్శించారు. అయిదు ప్రధాన కుంభకోణాలను స్పష్టం చేస్తూ కాగ్ నివేదిక వెలువడిందని అన్నారు. దీనిపై పార్లమెంటులో చర్చించాల్సిన పరిస్థితి ఉందన్నారు. కానీ పార్లమెంట్ కార్యకలాపాలు స్తంభించిపోతున్న సమయంలో హడావుడిగా బిల్లులు ఆమోదించారని ఏచూరి విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, తపన్ సేన్, కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు మురళీధరన్, తదితరులు పాల్గొన్నారు.