భరతమాత ప్రతి భారతీయుని వాణి

– ప్రజాశక్తే నన్ను ముందుకు నడిపిస్తోంది
– భారత్‌ జోడో యాత్ర అనుభవాలను పంచుకున్న రాహుల్‌
న్యూఢిల్లీ : భరతమాత ప్రతి భారతీయుని వాణి అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పారు. దేశ ప్రజలకు ఆయన 77వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ద్వారా సందేశం ఇస్తూ 145 రోజుల పాటు తాను జరిపిన భారత్‌ జోడో యాత్ర అనుభవాలను పంచుకున్నారు. సముద్రం అంచున యాత్రను ప్రారంభించి, కాశ్మీర్‌ మంచును తాకానని వ్యాఖ్యానించారు. వేడి, దుమ్ము, వర్షాన్ని దాటుకుంటూ అడవులు, పట్టణాలు, కొండల మీదుగా తనకు ఎంతో ఇష్టమైన కాశ్మీర్‌ మంచును చేరుకున్నానని తెలిపారు. యాత్ర సందర్భంగా ఎన్నో ఇబ్బందులు పడ్డానని, అయితే ప్రజలు ఇచ్చిన ప్రేరణ తనను ముందుకు నడిపిందని అన్నారు. ‘యాత్ర ప్రారంభమైన కొద్ది రోజులకే నెప్పి మొదలైంది. నా పాత మోకాలి నెప్పి తిరగబెట్టింది. నా ఫిజియోథెరపిస్టు వచ్చి మునీశ్వరుడిలా కొన్ని సలహాలు ఇచ్చారు. కానీ నెప్పి అలాగే ఉంది. అయితే అప్పుడు కొన్ని విషయాలు గమనించాను. ఆగాలని అనిపించిన ప్రతిసారి, యాత్రకు విరామం ఇద్దామని అనుకుంటున్న ప్రతి సందర్భంలోనూ ఎవరో ఒకరు వచ్చి యాత్రను కొనసాగించేందుకు కావాల్సిన శక్తిని ఇచ్చే వారు’ అని వివరించారు. యాత్ర ముందుకు సాగుతున్నప్పుడు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి కలిశారని, నెప్పి అలాగే ఉండడంతో ఆగి వారు చెప్పింది వినే వాడినని రాహుల్‌ అన్నారు. కాగా జోడో యాత్ర ముగియలేదని, తిరిగి మొదలవుతుందని కాంగ్రెస్‌ నేతలు వెల్లడించారు.

Spread the love