విద్యార్థులతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు కిటకిట!

నవతెలంగాణ – హైదరాబాద్
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థులతో గడచిన వారం రోజులుగా రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌ విమానాశ్రయం కిటకిటలాడుతోంది. విద్యార్థులను సాగనంపేందుకు వారితో పాటు కుటుంబీకులు, స్నేహితులు 20 నుంచి 30మంది వస్తుండటంతో ఎయిర్‌పోర్ట్‌లో డిపార్చర్‌ వద్ద ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రయాణికులు ఇక్కట్లపాలవుతున్నారు. అమెరికా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌, మలేసియా వంటి దేశాలకు విద్యాభ్యాసానికి విద్యార్థులు వెళ్తున్నారు. ఒక్కో విద్యార్ధి వెంట నలుగురికి మించి రాకూడదని కొన్ని రోజులు క్రితం విమానాశ్రయ అధికారులు, పోలీసులు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. మంగళవారం ఎయిర్‌పోర్టులో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఒకేసారి వందలాది వాహనాలు రావడంతో ట్రాఫిక్‌ సిబ్బందికి వాటి నియంత్రణ తలకు మించిన భారంగా మారింది. ఈ పరిస్థితిని చూసి ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు అదనపు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని కోరుతున్నారు.

Spread the love