25వేల ఉద్యోగాలు హైకోర్టు రద్దుపై సుప్రీంకోర్టు స్టే

నవతెలంగాణ – ఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో 25వేల ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు  తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కొనసాగించవచ్చని తెలిపింది. కానీ, అభ్యర్థులు లేదా అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది. బెంగాల్‌లో 25,743 మంది టీచర్లు, నాన్‌టీచింగ్‌ సిబ్బంది నియామకాలకు సంబంధించి చోటుచేసుకున్న కుంభకోణంలో కలకత్తా హైకోర్టు ఏప్రిల్‌ 22న సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. 2016 నాటి స్టేట్‌ లెవల్‌ సెలక్షన్‌ టెస్ట్‌ చేపట్టిన నియామక ప్రక్రియ చెల్లదని అందులో పేర్కొంది. ఆ నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. అంతేగాక, దీనికింద ఉద్యోగాలు సాధించిన టీచర్లు తమ వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని వెల్లడించింది. ఈ తీర్పును బెంగాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది. ఇది వ్యవస్థీకృత మోసమేనని, నియామకాల్లో అవకతవకలు జరిగితే.. వ్యవస్థలో ఇంకేం మిగులుతుందని ప్రశ్నించింది. అంతేకాకుండా వ్యవస్థపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతే ఇంకేం మిగలదని వ్యాఖ్యానించింది.

Spread the love